జనసంద్రంగా మారిన గద్వాల

గద్వాల (మహబూబ్ నగర్ జిల్లా):

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు గద్వాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  డప్పు వాయిద్యాలు, గుర్రాల ర్యాలీతో షర్మిలకు ఘన స్వాగతం పలికారు.  షర్మిల పాదయాత్ర పట్టణంలోకి ప్రవేశించే సరికి సమీప గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో గద్వాల జన సంద్రంగా మారింది.

     వైయస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల పాదయాత్ర మంగళవారం సాయంత్రం పాలమూరు జిల్లాలోని గద్వాలకు చేరుకుంది. జిల్లాలో ఆరో రోజు కొనసాగిన షర్మిల పాదయాత్రకు దారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ షర్మిల ముందుకు సాగారు. షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

     మంగళవారం నాటికి  554 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న షర్మిలను చూసేందుకు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గద్వాలలో షర్మిల బహిరంగ సభ ఉందని తెలియడంతో ఉదయం నుంచే ఆటోలు, బస్సులు, వ్యాన్లలో ప్రజలు గద్వాల దారి పట్టారు.

  
షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో గద్వాల పుర వీధులు జనంతో కిక్కిరిసి పోయాయి. దారిపొడవునా షర్మిలతో కరచాలనం చేసేందుకు యువత ఆసక్తి కనబరిచింది. జై జగన్, జై జై జగన్, వైయస్ఆర్ కాంగ్రెస్ జిందాబాద్... వంటి నినాదాలతో గద్వాల పట్టణం హోరెత్తింది.  ఇళ్లు, మిద్దెల పైనుంచి జనం చేయి ఊపుతూ ఆనందడోలికల్లో మునిగిపోయారు. షర్మిల వారి వైపు చూపిన సమయంలో ఈలలు వేస్తూ, నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.

     ఇక గద్వాల బహిరంగ సభలో షర్మిల చేసిన ప్రసంగం ఆద్యంతం జనాన్ని ఆకట్టుకుంది. ఇతర పార్టీల నేతలను విమర్శించినపుడు జనం చప్పట్లతో ఆ ప్రాంతం మర్మోగింది. స్థానిక సమ్యలను ప్రస్తావిస్తూనే పాలకుల నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టిన విధానం బాగుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top