జననేత సోదరికి జనం బాధలు ఏకరువు

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు జనం తమ బాధలు ఏకరువు పెట్టుకుంటున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిలను దారి పొడవునా కలుస్తున్న స్థానికు, ముఖ్యంగా మహిళలు కిరణ్‌ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను చెప్పుకుని ఆవేదన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ నుంచి బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర కొంత దూరం సాగిన తరువాత తుర్కయాంజాల్‌ గేట్‌ వద్ద శ్రీమతి షర్మిల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కూడా పలువురు వృద్ధ మహిళలు, వితంతువులు, వికలాంగులు సమస్యలు చెప్పుకున్నారు.

ఇష్టం వచ్చిన రీతిలో విద్యుత్‌ చార్జీలు పెంచేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తోందని కొందరు మహిళలు విలపించారు. తమకు పింఛన్లు సరిగా అందడం లేదని కొందరు వృద్ధ మహిళలు శ్రీమతి షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఉచిత విద్యుత్‌ పథకం అమలు తీరు అసలే బాగోలేదని కొందరు ఆవేదన చెందగా, ఒకే ఒక్క బల్బు ఉన్న తన ఇంటికి రూ. 5 వేలు బిల్లు వచ్చిందని వాపోయింది. ఆ బిల్లుకు డబ్బులు చెల్లించాలంటూ అధికారుల తీవ్రంగా వేధిస్తున్నారని శ్రీమతి షర్మిల ముందు కన్నీరు మున్నీరైంది.

కిలో రూపాయి బియ్యం కేవలం 4 కేజీలే ఇస్తే నెలంతా ఎక్కడ సరిపోతాయని మరో వృద్ధురాలు శ్రీమతి షర్మిల ముందు ప్రభుత్వాన్ని నిలదీసింది. పావలా వడ్డీ రుణాలకు బ్యాంకు అధికారుల చక్ర వడ్డీ మాదిరిగా లెక్కలు వేసి తమ నుంచి రూపాయికి పైగా నిర్బంధంగా వసూలు చేస్తున్నారని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఎన్నడూ లేని విధంగా గ్యాస్‌ సిలిండర్లపై నియంత్రణ తీసుకువచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌ అనే 'దెయ్యం'తో లింకు పెట్టి ఇక్కట్ల పాలు చేస్తున్నదని స్థానికుడు ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొటున్న ఇబ్బందులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి నిత్యం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిలకు తమ బాధలు చెప్పుకునేందుకే తామంతా పాదయాత్రకు తరలివచ్చిమని మరి కొందరు పేర్కొన్నారు. జననేత శ్రీ జగన్‌ సిఎం అయితే, రాజన్న రాజ్యం వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరతాయని మరికొందరు ధీమా వ్యక్తంచేశారు.
Back to Top