'జననేత జగన్‌ పట్ల తిరుగులేని జనాభిమానం'

వేములవాడ (కరీంనగర్‌ జిల్లా) : కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్‌ పార్టీ జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని జైలులో ఉంచగలిగిందే కానీ ప్రజాభిమానాన్ని ఆపలేకపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఆది శ్రీనివా‌స్ అన్నారు.‌ శ్రీ జగన్ విడుదల కోరుతూ వేములవాడ శ్రీ‌ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఎదుట చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన తొలి సంతకం చేసి ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకం చేశారు. వేములవాడలో నిర్వహించిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమం తొలి రోజు మధ్యాహ్నానికే సుమారు 600 సంతకాల సేకరణ పూర్తయింది. ఐదు రోజుల పాటు సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ‌ కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టారన్న అక్కసుతోనే ప్రభుత్వం శ్రీ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. శ్రీ వైయస్ జగ‌న్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నది ఈ చర్యల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కిరణ్ ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీనివా‌స్ విమర్శించారు. కాంగ్రె‌స్, ‌టిడిపిలు కుమ్మక్కై శ్రీ జగన్‌ను జైల్లో పెట్టించారని బుధవారంనాడు ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల రూపంలో నిరసన తెలుపుతున్నారని ఆయన తెలిపారు. 

'సంతకాని'కి విశేష స్పందన:
మంకమ్మతోట : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ జగన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టిన ‌'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని బస్‌స్టేషన్ ఆవరణలో జిల్లా కన్వీన‌ర్‌ పుట్ట మధు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మధు మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని ఆకాంక్షించారు. కుట్ర పూరితంగా బనాయించిన కేసుల నుంచి త్వరలోనే బయటికి రావాలని ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా చేయించిన సంతకాల పత్రాలను నాయకులు, కార్యకర్తలు మూడవ తేదీలోగా పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేయాలని కోరారు. నగర కన్వీనర్ పింగిళి రవీంద‌ర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Back to Top