జనం శ్రమను దోచేస్తున్న ప్రభుత్వం

తిరుగండ్లపల్లి (నల్గొండ జిల్లా), 9 ఫిబ్రవరి 2013: నల్లగొండ జిల్లోని ఫ్లోరోసిస్‌ వ్యాధి, మంచినీటి సమస్యలపై శ్రీమతి షర్మిల స్పందించారు. 'నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తుల గురించి పత్రికల్లో రాయండి, మీడియాలో చూపించండి అప్పుడైనా స్పీకర్‌కు లైట్‌ వెలుగుతుందేమో' అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. 'జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత దిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తార'ని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన జగనన్న నిలబడతారని భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం తిరుగండ్లపల్లిలో శ్రీమతి షర్మిల శనివారం మధ్యాహ్నం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి షర్మిల స్థానికుల కష్టాలను  అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

ఫ్లోరోసిస్‌, మంచినీటి సమస్యల నుంచి తమకు విముక్తి కలిగించాలని స్థానిక మహిళలు రచ్చబండలో శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. ఒకే ఒక్క విద్యుత్‌ బల్బు వినియోగించుకుంటున్నా కిరణ్‌ ప్రభుత్వం మూడేసి వందల రూపాయల బిల్లులు వేస్తున్నదని మహిళలు చెప్పారు. నిరుపేదలైన తాము అంతంత బిల్లులు ఎలా కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు తమకు వంద రూపాయలకు మించి విద్యుత్‌ బిల్లులు రాలేదని చెప్పారు. ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నా మిగతా ఉప్పు, పప్పు, నూనె, చక్కెర అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తాము భరించలేనంతగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

వారి సమస్యలు విన్న శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, విద్యుత్‌ బిల్లులు ఇంతకు ముందరి కన్నా రెండు రెట్లు, మూడు రెట్లు వస్తున్నాయని అన్నారు. సర్దుబాటు చార్జీల పేరుతో ఈ ప్రభుత్వం జనం నెత్తిన ఆర్థిక భారం పెంచేస్తోందని దుయ్యబట్టారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఏ చార్జీలూ పెంచలేదన్నారు. ఆర్టీసీ చార్జీలు, గ్యాస్‌ ధరలు పెరగలేదన్నారు. ఏ చార్జీలూ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్సుమెంట్‌ లాంటి ఎన్నో పథకాలు చేశారన్నారు. ప్రజల మీద ఎలాంటి భారాన్నీ పడనివ్వలేదన్నారు. మహిళలందరూ తన అక్క చెల్లెళ్ళుగా భావించారని, వారందరినీ లక్షాధికారులను చేయాలని తపించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అందుకే పావలా వడ్డీకే రుణాలిచ్చారు. అవునా? అని శ్రీమతి షర్మిల రచ్చబండకు హాజరైన మహిళలను ఉద్దేశించి అన్నారు.

పన్నులేవీ పెంచకుండా, చార్జీలు పెంచి ప్రజలను బాధలు పెట్టకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదని, వారి బాధలు పట్టించుకోవడం లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ప్రజల శ్రమను ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీలకు వంద రూపాయలు ముట్టేదని, ఇప్పడు 20, 30 రూపాయలు ఇస్తున్నారంటే మీ శ్రమను, రక్తాన్ని కూడా ఈ ప్రభుత్వం దోచుకుంటున్నదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం పోయే కాలం దగ్గరలోనే ఉందని శాపనార్థాలు పెట్టారు.

ఇప్పటి ముఖ్యమంత్రి అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నట్లు చెబుతున్నారని, ఎంత మందికి వడ్డీ లేని రుణాలు అందుకున్నారంటూ శ్రీమతి షర్మిల అడిగారు. అలా వడ్డీ లేని రుణాలు తమకు ఇంతవరకూ అందలేదని, పావలా వడ్డీ పథకంలో తాము తీసుకున్న రుణాలకే ఈ ప్రభుత్వం రెండు, మూడు రూపాయలు వడ్డీగా వసూలో చేస్తోందని కొందరు మహిళలు వాపోయారు.
Back to Top