జనం గుండెల్లో జననేత జగన్: ఉమ్మారెడ్డి

విజయవాడ, 12 మే 2013: కాంగ్రెస్‌, టిడిపిల కుట్రల కారణంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి భౌతికంగా జైలులో ఉన్నా మానసికంగా రాష్ట్ర ప్రజల గుండెల్లోనే ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను తొలగించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరోపణలు‌ ఉన్న మంత్రులను ఎందుకు తొలగించలేదని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మంత్రుల జోలికి వెళితే రహస్యాలను బయటపెడతారనే భయం ప్రభుత్వానికి పట్టుకుందని ఎద్దేవా చేశారు.

ప్రజాకంటక, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి‌ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పూర్తి రక్షణగా నిలుస్తున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ వదిలిపెట్టిన వారిని విమర్శించడం మానుకుని..చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉమ్మారెడ్డి హితవు చెప్పారు. విచారణ గడువు పొడిగించాలని న్యాయవాది అశోక్‌భాను చెప్పడం సిబిఐ ఆంతర్యమా? సోనియా ఆంతర్యమా అని ఆయన ప్రశ్నించారు.
Back to Top