రాష్ట్ర హక్కుల కోసం జననేత జలదీక్ష

తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లతో ఏపీకి నష్టం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పాలకపక్షం
టీడీపీ నిర్లక్ష్యంతో ఎడారిగా మారనున్న ఆరు జిల్లాలు
కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ 
ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా వైయస్ జగన్ పోరుబాట
మూడ్రోజుల పాటు కర్నూలు వేదికగా జలదీక్ష

హైదరాబాద్ః కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్ట్ లతో ఏపీ ఎడారిగా మారే ప్రమాదముందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి నీటి ప్రాజెక్ట్ లు, ఎత్తిపోతల పథకాలు కడుతోందని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం  వాటిని నిలువరించలేకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో నిర్మించబోయే ప్రాజెక్ట్ లకు బాబు అభ్యంతరాలు తెలపకపోవడం చాలా బాధకరమన్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉమ్మారెడ్డి కోరారు. దీనిలో భాగంగానే నీటివనరుల తీవ్రతను, రాబోయే పెనుముప్పును తెలియజెప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి  మూడ్రోజుల పాటు జలదీక్ష చేపడుతున్నట్లు ఉమ్మారెడ్డి ప్రకటించారు. 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉమ్మారెడ్డి ఫైరయ్యారు. తెలంగాణ నిర్మించబోయే పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాల వల్ల...ఆంధ్రప్రదేశ్ కు సాగునీరు కాదు గదా శాశ్వతంగా తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఉమ్మారెడ్డి  అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే రాష్ట్రానికి ఈపరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్ట్ లు అక్రమ ప్రాజెక్ట్ లని, కేంద్రం నుంచి అనుమతులు లేకుండానే కడుతున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు.  వాటిని టీడీపీ ప్రభుత్వం నిలువరించకపోవడం అత్యంత దారుణమన్నారు. 

1996లో అధికారంలో ఉన్న టీడీపీ జీవో 69 తీసుకొచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ లో 854 అడుగుల నీటిమట్టాన్ని 834కు తగ్గించిందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.  శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పొత్తిరెడ్డి పాడు, వెలిగొండ ప్రాజెక్ట్ లకు నీరందే పరిస్థితి ఉటుందని గ్రహించిన వైయస్సార్..... 2004లో ఈజీవోను రద్దు చేసి నీటిమట్టాన్ని పెంచారని చెప్పారు. కానీ ఈతెలంగాణ ప్రభుత్వం 800 అడుగులుండగానే ... పాలమూరు-రంగారెడ్డి, డిండిలకు 120 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చుక్క నీరు కూడా అందే పరిస్థితి ఉండదన్నారు. విభజన చట్టంలోని నిబంధనలకే తెలంగాణ ప్రభుత్వం పరిమితం కావాలని ఉమ్మారెడ్డి సూచించారు.  

చంద్రబాబు హయాంలో ఆనాడు  కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ వల్ల దిగువకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందని....ఇవాళ మళ్లీ తెలంగాణ నిర్మించబోయే అక్రమ ప్రాజెక్ట్ లతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బీడులుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారని,  వలసలు పోతున్నారని,  అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. ఆప్రాంత ప్రయోజనాలు 
కాపాడే దానిలో ప్రభుత్వం పూర్తిగా విఫమలైందని దుయ్యబట్టారు. దీనిపై  ప్రజలకు వివరణ ఇచ్చేందుకు... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి  ప్రాజెక్ట్ లను  నిలువరించాలన్న ఉద్దేశ్యంతోనే వైయస్ జగన్ దీక్ష చేస్తున్నారని ఉమ్మారెడ్డి చెప్పారు.

కృష్ణా, గోదావరి లపై ప్రాజెక్ట్ లు  నిర్మించాలంటే బోర్డు పర్మిషన్ తో పాటు రెండు రాష్ట్రాల అనుమతులు ఉండాలన్నారు.  విభజన చట్టం 11వ షెడ్యూల్ లోఈ నిబంధనను  పొందుపర్చిన విషయాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు.  కానీ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్ట్ లపై ఎందుకు అభ్యంతరాలు చెప్పడం లేదో అర్థం కావడం లేదన్నారు.  పాలకపక్షం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కృష్ణానీటి వినియోగంపై లోతైన అధ్యయనం జరగాలన్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్ లకు అనుమతించడం కరెక్ట్ కాదని,  కేంద్రం దీన్ని అడ్డుకోవాలని ఉమ్మారెడ్డి కోరారు. తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్ట్ లను నిలదీయలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉండడం ఆందోళనకరమన్నారు. 

అదేవిధంగా గోదావరి డెల్టాకు సంబంధించి పోలవరం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని ఉమ్మారెడ్డి చెప్పారు. ఈప్రాజెక్ట్ కు తెలంగాణనుంచి ఎలాంటి అనుమతి కూడా అవసరం లేదని చట్టంలో  పేర్కొన్న విషయాన్ని చెప్పారు.  పోలవరాన్ని కట్టేందుకు కేంద్రం ముందుకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా.... పట్టిసీమ పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేసిందని దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు కృష్ణాలో పోసి రాయలసీమకు వాడుతామన్న వాదనలో హేతుబద్ధత లేదన్నారు. కేంద్రంతో తగాదా వద్దంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని...తెలంగాణ విషయంలోనూ అదే ధోరణి అవలంభిస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు తీరుతో ఏపీ శాశ్వతంగా నష్టపోతోందని వాపోయారు.  మన హక్కులు మనం కాపాడుకోవాలనే వైయస్ జగన్ దీక్షకు సిద్ధమయ్యారని, దీనికే విశేషస్పందన వస్తోందని ఉమ్మారెడ్డి చెప్పారు. రాష్ట్రం భవిష్యత్తు కోసం పోరాడుతున్న వైయస్ జగన్ దీక్షకు మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 
Back to Top