అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం

ఏడీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన
రైతుకు న్యాయం చేయాలని డిమాండ్


కోరుకొండ:  మండలంలోని కోటి గ్రామానికి చెందిన రైతు అడపా వెంకటరాజుకు న్యాయం చేయాలంటూ కోరుకొండ ఏడీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేశారు.  రైతు అడపా వెంకటరాజు ఏడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ట్రాక్టర్ రుణం కోసం  డీడీ కట్టించి, రుణం మంజురైన తరువాత అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అడపా వెంకటరాజుకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాధికారులు టీడీపీ నాయకుల సేవ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. వెంకటరాజుకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంకటరాజుతో పాటు పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏడీఏ కార్యాలయానికి సాయంత్రం వచ్చిన ఏడీఏ డీవీ కృష్ణతో చర్చించినా ఫలితం దక్కలేదు. కోరుకొండ మండల పార్టీ కన్వీనర్ చింతపల్లి చంద్రం, మండల రైతు కన్వీనర్ తోరాటి శీను, మండల బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి,  లక్ష్మీనారాయణ, సలాది వెంకటేశ్వరరావు, కాలచర్ల శివాజీ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతు అడపా వెంకటరాజుతో పాటు పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు చింతపల్లి చంద్రం, అడపా కుమార్, గట్టి ప్రసాద్, వాకా నరసింహారావు,  శీను, సలాది వెంకటేశ్వరరావు, బరుసు బద్రి, గరగ మధు, అయిల శీనులను అరెస్ట్ చేసి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వ్యక్తి గత పూచికత్తుపై విడిచిపెట్టామని కోరుకొండ ఎస్‌ఐ  జె.ఆదినారాయణ, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ  రాంబాబు తెలిపారు. అక్రమ అరెస్టులను వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం తీవ్రంగా ఖండించారు.
Back to Top