17 నెలలుగా జీతాలు లేవు

ఇబ్బందులు తాళలేక పది మంది కార్మికులు చనిపోయారు
వైయస్‌ జగన్‌ను కలిసిన జైపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు
న్యాయం చేస్తానని జననేత హామీ 
పశ్చిమగోదావరి: చంద్రబాబు సర్కార్‌ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని చాగల్లు జైపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 184వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కార్మికులు కలుసుకున్నారు. 17 నెలలుగా బకాయిలు అందడం లేదని, తమకు న్యాయం చేయాలని జననేతను కోరారు. బకాయిలు అందడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 17 నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారిందని, ఇబ్బందులు తాళలేక సుమారు పది మంది కార్మికులు చనిపోయారన్నారు. కార్మికుల సమస్యలు విని చలించిన వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
రోడ్డు మీద పడ్డాం...
జైపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ సీజ్‌ చేయడంతో రోడ్డుమీద పడ్డామని ఫ్యాక్టరీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ నీలకొండ వెంకట కృష్ణారావు అన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల క్రితం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌ ఫ్యాక్టరీని సీజ్‌ చేసి ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను తీసుకొచ్చారన్నారు. 2016 జనవరి 20వ తేదీన కంపెనీకి సీల్‌ వేసి కార్మికులను రోడ్డు మీద తోసేశారన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, గేట్‌ బయటే విధులు నిర్వహించి వెళ్లిపోండి.. వేతనాలు ఇస్తామని ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికీ 17 నెలల జీతం రావాల్సి ఉందని, ఇబ్బందులు తాళలేక దాదాపు పదిమంది కార్మికులు మృతి చెందారన్నారు. 86 రోజులుగా దీక్షలు చేస్తే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి దీక్ష విరమింపజేసిన మంత్రి జవహార్‌ ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. 
Back to Top