'జగన్‌ను ప్రజలు సిఎం చేయడం ఖాయం'

హైదరాబాద్, 19 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు తప్పకుండా ముఖ్యమంత్రిని చేస్తారని సిపిఐకి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి తాను శ్రీ జగన్‌కు అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో మంగళవారంనాడు ములాఖాత్‌ సమయంలో ఆయన సతీ సమేతంగా వెళ్ళి కలుసుకున్నారు. సుమారు అరగంట పాటు శ్రీ జగన్‌తో భేటి అయ్యారు. అనంతరం జైలు బయట పాయం మీడియాతో మాట్లాడారు. తాము వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గాన్ని మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అన్ని విధాల ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైయస్ ‌ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయని పాయం చెప్పారు. పేద ప్రజల కోసం దివంగత మహానేత వైయస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం అమలు కావడంలేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు‌ కుమ్మక్కై, కుట్రపూరితంగా కేసులలో ఇరికించాయని పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మొన్న అసెంబ్లీలో వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకుండా టిడిపి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని పాయం దుమ్మెత్తిపోశారు.
Back to Top