జగన్‌ నిర్దోషిగా విడుదలవుతారు

హైదరాబాద్, 30 జనవరి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న  ఎనలేని ప్రజాదరణ చూసి ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారని ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (టీడీపీ) చెప్పారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. శ్రీ జగన్ అరెస్టయిన నాటి నుంచి తాను మనస్తాపానికి గురయ్యానన్నారు. కుటిల రాజకీయంతో పెట్టిన కేసులు ఎంతోకాలం నిలువవని ఆయన స్పష్టంచేశారు. భద్రాచల రాముని ఆశీస్సులతో ఆయన త్వరలో నిర్దోషిగా విడుదలై, ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డిని గిరిజనులను ఎంతగానో ఆదరించారనీ, గిరిజనులకు ఉపయోగపడేలా రంపచోడవరం, సీతమ్మవాగు వంటి ప్రాజెక్టులు నిర్మించారనీ ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటే శ్రీ జగన్ కేంద్రమంత్రి గానీ ముఖ్యమంత్రి గానీ అయ్యేవారని గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దుర్నీతి స్పష్టమయిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన పాదయాత్ర, బస్సు యాత్ర భద్రాచలం రాముని ఆశీస్సులతో, గిరిజనుల అండతో విజయవంతమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూడా శ్రీ జగన్‌ను కలిసి వెళ్లారు.

Back to Top