జగన్‌ నిర్బంధంపై కదంతొక్కిన జనం

హైదరాబాద్ :

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ జగన్‌ ఒక్కరు లక్ష్యంగా కుమ్మక్కయి కుట్రలు చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు, వాటికి కొమ్ము కాస్తున్న యెల్లో మీడియా కూటమి తీరుకు వ్యతిరేకంగా సోమవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, నిరసన ర్యాలీలు జరిగాయి. జననేత శ్రీ జగన్‌పై అక్రమ కేసులు మోపి జైలులో పెట్టి ఏడాదిగా నిర్బంధించిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనతో కదంతొక్కారు. ఒక్కడిని చేసి బంధించి సాగిస్తున్న వేధింపులపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్న శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి, ఆయన కుటుంబానికి అండగా ఉన్నామంటూ సంఘీభావం ప్రకటించారు. శ్రీ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసి సోమవారానికి ఏడాది పూర్తయింది. ఇన్నాళ్లుగా ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలతో అడ్డుకుంటూనే ఉన్నారు.

‌ఈ నేపథ్యంలో సోమవారం 'ప్రజాస్వామ్య విద్రోహదినం'గా పాటిస్తూ రాష్ట్ర రాజధాని మొదలు రాష్ట్రమంతటా శ్రీ జగన్ అభిమానులు, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు సైతం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ మరణించిన తర్వాత రాష్ట్రాన్ని కమ్ముకున్న చీకట్లు తొలగి మళ్లీ వెలుగులు నిండాలంటూ కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శనలు చే‌శారు. ‌జైలు నిర్బంధాలు, కాంగ్రెస్ మార్కు కక్షసాధింపులు శ్రీ జగన్‌ను ప్రజల గుండెల్లోంచి దూరంచేయలేవని గొంతెత్తి నినదించారు.

విజయమ్మ నేతృత్వంలో...:
శ్రీ జగన్‌ను అక్రమంగా అరెస్టుచేసి ఏడాది అయిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పీపు‌ల్సు ప్లాజాలో సోమవారం భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ర్యాలీ నిర్వహించి శ్రీ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నెక్లె‌స్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహం వద్ద నివాళు‌లు అర్పించి శ్రీ జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా తొలి కొవ్వొత్తిని వెలిగించారు. ఆమెతో పాటు‌ శ్రీ జగన్ సతీమణి శ్రీమతి ‌వైయస్ భారతి కూడా మరో వైపు కొవ్వొత్తిని చేతబూని అక్కడకు చేరుకున్న ప్రజలకు అభివాదం చేశారు.‌ శ్రీ జగన్ కుమార్తెలు కూడా తల్లి వెంట వచ్చారు.

‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు వెంట రాగా వెలుగుతున్న కొవ్వొత్తులను చేతబూనిన శ్రీమతి విజయమ్మ, శ్రీమతి భారతి ర్యాలీగా ముందుకు సాగారు. వారి వెనుక వేలాది మంది కార్యకర్తలు నడిచారు. ఈ సందర్భంగా ‘జై... జగన్!’, ‘జోహా‌ర్... వై‌యస్‌ఆర్’, ‘‌సిబిఐ డౌన్ డౌ‌న్’ ‌నినాదాలు మిన్నంటాయి. సిబిఐని పంజరంలో చిలుక అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా పంజరంలో బంధించిన చిలుక బొమ్మలను ప్రదర్శన ముందు భాగాన కొందరు కార్యకర్తలు ప్రదర్శించారు. శ్రీ జగన్ అరెస్టుకు నిరసనగా అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు.

వర్షాన్ని ‌కూడా ఖాతరు చేయకుండా.. :
కర్నూలు కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద వర్షాన్ని సైతం ‌ఖాతరు చేయకుండా గంటపాటు నిరసన కార్యక్రమం చేశారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున మోటార్ సైకి‌ల్ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం, ఆత్మకూ‌‌ర్, కోడుమూరు, పత్తికొండ, నంద్యాలలో కార్యకర్తలు, నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆరువేల మందితో భారీ ఎత్తున కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో భారీ స్థాయిలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. నెల్లూరు, ఉదయగిరి, కోవూరుల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనంతపురం నందిని హోటల్ వద్ద ఉన్న‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహం నుంచి వేలాదిగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండ, తాడిపత్రి, కదిరిల్లోనూ ప్రదర్శనలు జరిగాయి.

కాగా, గుంటూరులో భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మహిళలు ప్రత్యేకంగా పాల్గొని శ్రీ జగన్ అక్రమ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. విశాఖపట్నంలో ఆర్కే బీ‌చ్ నుంచి కిర్లంపూడి లే అవు‌ట్ బీ‌చ్‌రోడ్డులోని డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహం వరకు కొవ్వుత్తుల ర్యాలీ చే‌శారు. తూర్పు, పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.

కళ్లకు గంతలతో..:
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ముస్తాబా‌ద్‌లలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఎదుట వైయస్‌ఆ‌ర్ కాంగ్రెస్ యూ‌త్, విద్యార్థి విభాగాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మహబూ‌బ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గకేంద్రాల్లో‌నూ నిరసనలు నిర్వహించారు. వరంగల్ జిల్లా స్టేష‌న్‌ఘన్‌పూర్, నర్సంపేట, డోర్నక‌ల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబా‌ద్‌ కలెక్టర్ చౌ‌క్ నుంచి బస్టాండ్ వరకు భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిర్మ‌ల్, మంచిర్యాల, కాగ‌జ్‌నగర్, ఖానాపూ‌ర్, ఆసిఫాబా‌ద్, బెల్లంపల్లి లాంటి నియోజకవర్గ‌ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఖమ్మంలో కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, చర్చిలో ప్రార్థనలు చేశారు.

ప్రజలే గుణపాఠం చెబుతారు: విజయమ్మ :
శ్రీ జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించిన రాజశేఖరరెడ్డి, ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులకు శ్రీమతి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. మహానేత వైయస్,‌ జననేత శ్రీ జగన్ కోసం ఈ ర్యాలీల్లో పాల్గొన్న వారందరికీ ‌ఆమె కృతజ్ఞతలు తెలిసారు. ఏడాది క్రితం.. ఇదే రోజు, ఇదే సమయంలో శ్రీ జగన్‌ను సిబిఐ దర్యాప్తు పేరుతో అరెస్టు చేసిందని ఆమె ఆవేదనతో చెప్పారు.

వారు చెప్పిందే చట్టమా: భారతి:
సిబిఐ మొదటి మూడు చార్జిషీట్లు వేసే ముందు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదని.. కానీ ఆయనను మొదటి ముద్దాయిగా పేర్కొంటూ మూడు చార్జిషీట్లు వేసిందని ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి మీడియాతో అన్నారు. నిందితుడిని ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే, ఆరోపణలపై ఆయన ఏం చెప్తారనేది వినకుండానే మొదటి ముద్దాయిగా పేర్కొంటూ చార్జిషీట్లు ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. 22 నెలలుగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని.. ఇప్పటివరకూ శ్రీ జగన్ ఫలానా తప్పు చేశారని కనుక్కుందా అని ఆమె నిలదీశారు. ‘మమ్మల్ని రెండేళ్లుగా వేధిస్తున్నారు.. ఏం చేశామని? ప్రజలతో ఉండాలనుకోవటమే మేం చేసిన తప్పా? నా భర్తతో నేను, తమ తండ్రితో మా పిల్లలు జీవించే హక్కు మాకు లేదా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top