జగన్‌కు బెయిల్ కోసం 26న గణపతిహోమం

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ లభించాలని ఆకాంక్షిస్తూ ఈనెల 26న గుంటూరు నగరంలో చతురావృత గణపతిహోమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం బ్రాడీపేట 4/2లోని వైఎస్సార్ ప్రాంగణంలో గణపతిహోమ నిర్వహణకు సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని పార్టీనాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అరిపిరాల కళ్యాణశాస్త్రి ఆధ్వర్యంలో 26న ఉదయం 9.30గంటలకు శాస్త్రయుక్తంగా 12మంది వేదపండితులతో హోమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైఎస్ జగన్ రాకకోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. హోమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో పాటు ప్రజలందరూ పాల్గొనవచ్చన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్సు జిల్లా అధ్యక్షుడు ఎ.  ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ జగన్ జైలు నుంచి బయటకు వచ్చి ప్రజల తో మమేకంకావాలన్నదే అందరి ఆకాంక్ష అని చెప్పారు. హోమ నిర్వాహకులు కళ్యాణశాస్త్రి మాట్లాడుతూ చతురావృత గణపతిహోమం అత్యంత విశిష్టమైనదన్నారు. జగన్‌కు అన్ని విఘ్నాలు తొలగిపోయి జైలు నుంచి బయటకు రావాలని ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడన్నారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఏపీ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ రాతంశెట్టి సీతారామాంజనేయులు, చింతలచెర్వు మస్తాన్‌రెడ్డి,మేడా సాంబశివరావు, దాసరి శ్రీనివాస్, కోనూరు సతీష్‌శర్మ, నందిరాజు పాండురంగారావు, అయితి సతీష్‌శర్మ, యర్రం కృష్ణారెడ్డి, పార్టీ మైనార్టీసెల్ రాష్ట్రసభ్యులు ఎండీ కబీర్, పార్టీ ట్రేడ్ యూనియన్ నగర కన్నీనర్ షేక్ గులాం రసూల్, మెహమూద్, విద్యార్థి నేత యు.నర్శిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top