'జగనన్న వచ్చాక జీరో వడ్డీ రుణాలు'

గామాలపాడు (గుంటూరు జిల్లా), 24 ఫిబ్రవరి 2013: జగనన్న సిఎం అయ్యాక జీరో వడ్డీ రుణాలిప్పించి రైతులు, మహిళలను ఆదుకుంటారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. రాజన్న ఇచ్చిన హామీలన్నింటినీ జగనన్న కొనసాగిస్తారని ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు. కరెంటు కోతలు, అధిక బిల్లులతో దోచుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, దానికి పరోక్షంగా తోడుగా నిలుస్తున్న టిడిపిని సాగనంపాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానితోనే అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాడు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల వ్యవహారశైలితో అష్టకష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు మేమున్నామంటూ శ్రీ జగన్‌ తరఫున భరోసానిచ్చేందుకు ఈ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారంనాడు శ్రీమతి షర్మిల గామాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే బయటికి వస్తారని తెలిపారు. ఓదార్పు యాత్రలో జగనన్న ఇచ్చిన హామీ మేరకే ప్రజల కోరికలు నెరవేరుస్తారని చెప్పారు. కృష్ణా జలాలు గురజాల నియోజకవర్గం పక్క నుంచే వెళుతున్నా స్థానికులకు మంచినీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్ని వస్తువుల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయని, దానితో ప్రజలు అల్లాడిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. పెరిగిన ఖర్చులతో మహిళలు అల్లాడిపోతున్నారని, తమ బిడ్డలను బడికి పంపించే పరిస్థితి లేక కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఫీజులు కట్టలేని స్థితిలో వారు తమ పిల్లలను కూలిపనికి తీసుకువెళుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని జగనన్న సిఎం అయ్యాక సక్రమంగా అమలు చేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

అంతకు ముందు స్థానిక మహిళలు తమకు మంచినీరు అందడంలేదని, విద్యుత్‌ కోతలు ఎక్కువైపోయాయని, అయినా బిల్లులు మాత్రం రెట్లకు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని, తమకు రేషన్‌ కార్డులు లేవని, ఉన్న వారి కార్డులను కూడా తొలగించివేశారంటూ శ్రీమతి షర్మిల ముందు వాపోయారు.
Back to Top