జగనన్నతో రాజన్న రాజ్యం సాధ్యం

కంఠంరాజు కొండూరు(మంగళగిరి) 22 మార్చి 2013:

జగనన్న సీఎం అయితే మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తారని శ్రీమతి వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల 98వ రోజు పాదయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా  ఆమె కంఠంరాజు కొండూరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి మూడూ వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తారన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టిస్తారనీ, చదువుకోలేని వారిని చదివిస్తారనీ తెలిపారు. దీనికి కుల, మత ప్రాతిపదిక ఉండదన్నారు. రాజశేఖరరెడ్డిగారు ఏమేం చేస్తానన్నారో అన్నీ జగనన్న చేసి చూపిస్తారని భరోసా ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీరివ్వాలనేది మహానేత ఆశయమన్నారు. ఆ పని జగనన్న చేసి చూపిస్తారని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఎవరూ గుడిసెలలో ఉండాల్సిన అవసరముండదన్నారు. ఏటా పది లక్షల చొప్పున ఇళ్ళను నిర్మింపజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చేలా చూస్తాడని తెలిపారు.

రైతుల్ని పురుగుల్లా చూసిన బాబు
ముఖ్యమంత్రి కిరణ్ చెప్పేవన్నీ అబద్ధాలేననీ, వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించారే గానీ ఎక్కడా ఇవ్వలేదనీ శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ఆయన పాలన చంద్రబాబు హయాంను గుర్తు తెస్తోందని చెప్పారు. పక్కా ఇళ్ళు లేవు, వడ్డీ లేని రుణాలు లేవు.. చెప్పడమే తప్ప ఆచరణ లేదని ఆమె తెలిపారు. అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. ఒక వేళ రుణాలిచ్చినా రెండు రూపాయల వడ్డీ పడుతోందన్నారు. కరెంటు ఇచ్చేది ఐదు లేదా ఆరు గంటలనీ, బిల్లులు మాత్రం మూడింతలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారనీ వివరించారు. చంద్రబాబు పాలనలో కూడా ఇలాగే ఉండేదన్నారు. రైతుల్ని ఆయన పురుగుల మాదిరిగా చూశారని మండిపడ్డారు.  పేదలంటే ఆయనకు చాలా నిర్లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు రైతుల పరిస్థితి అలాగే ఉంది. చంద్రబాబు నాయుడుగారున్నప్పడు కాల్వల్లో నీళ్ళు ఉండేవి కావన్నారు. మహానేత ఉన్నప్పడు ఆయన పిలిస్తే వాన దేవుడు పలికేవాడన్నారు. ఇప్పుడు మళ్ళీ సాగు నీరు కానీ, తాగు నీరు కానీ లేవన్నారు. సమయం వచ్చినప్పడు చంద్రబాబునాయుడికీ, కిరణ్ కుమార్ రెడ్డికీ సరైన గుణపాఠం చెప్పాలని మహిళలను శ్రీమతి షర్మిల కోరారు. జగనన్నను ఆశీర్వదిస్తే తప్పకుండా రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు.

Back to Top