జగనన్న నేతృత్వంలో వైయస్ఆర్ సంక్షేమ రాజ్యం

మునుగోడు (నల్గొండ)11 ఫిబ్రవరి 2013:

కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అరవైరెండో రోజుకు చేరింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం దోనిపాములలో రచ్చబండ నిర్వహించారు. రచ్చబండలో పాల్గొన్న మహిళలు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పావలా వడ్డీ రుణాలతో తమను ఆదుకున్నారని వారు చెప్పారు. భూగర్భ జలాలు ఎండిపోయి తాగడానికి కూడా నీళ్ళు లేవని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. మహానేత ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు మంచినీరు తెచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆయన పోయిన తర్వాత పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

బోర్లలోనూ ఫ్లోరైడ్ నీళ్ళు కరవు

      ఈ ప్రాంతంలోని బోర్లలో ఫ్లోరైడ్ నీళ్ళు కూడా లేవని చెబుతున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారనీ, తాగుదామంటే బోర్లలో ఫ్లోరైడ్ నీళ్ళు కూడా రావడం లేదనీ ఆమె పేర్కొన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు 455 గ్రామాలకు కృష్ణా జలాలు రప్పించారని శ్రీమతి షర్మిల చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కృష్ణా జలాల కేటాయింపులో చిత్తశుద్ధి లేకపోవడంతో మీకు నీళ్ళు రావడం లేదని తెలిపారు. ఐదు రోజులకొకసారి మంచినీరు ఇస్తున్నారనీ.. పరిస్థితి చాలా దారుణంగా ఉందనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడున్నది రాజశేఖరరెడ్డిగారి ప్రభుత్వం కాదనీ, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వమనీ.. పరిస్థితి చాలా అధ్వానంగా ఉందనీ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికీ ఏ మాత్ర తేడా లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు రూ. తొమ్మిది కోట్లిచ్చాన్నారు. రాజశేఖరరెడ్డిగారు 375 కోట్లిచ్చి ఇక్కడి గ్రామాలన్నింటికీ మంచినీళ్ళివ్వాలని భావించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. 'చాలామటుకు అంటే 500 వరకూ గ్రామాలు మంచినీటికి ఇప్పటికీ నోచుకోవడంలేదు. ఆ పనులు ఇంకా మిగిలిపోయాయి. రాజశేఖరరెడ్డిగారు బతికుంటే ఆగిపోయిన పనులు పూర్తయ్యి ఆ గ్రామాలకు కూడా మంచినీరంది ఉండేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళివ్వడం లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికీ, టీడీపీకి బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే మంచినీటి సరఫరాను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తారన్నారు. ప్రస్తుతం సాగునీటి సరఫరా, పిల్లలకు చదువులు, ఫీజు రీయింబర్సుమెంటు ఇలా ఏ పథకమూ సక్రమంగా అమలు కావడంలేదన్నారు. మీరంతా జగనన్నను ఆశీర్వదిస్తే అన్ని పథకాలు రాజన్న హయాంలో మాదిరిగా అమలవుతాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

     అంతకు ముందు మహిళలు ఆమెకు తమ కష్టాలు చెప్పుకున్నారు. కల్తీ కల్లును అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనీ, కల్తీ కల్లు బాధితులకు సాయం అందడం లేదనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు. చేతివృత్తుల వారికి సాయం కూడా అందడంలేదన్నారు.

Back to Top