జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికీ మేలు

జుజ్జువరం (కృష్ణాజిల్లా), 1 ఏప్రిల్ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప ఎం.పి. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలందరికీ మేలు జరుగుతుందని శ్రీమతి షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా జుజ్జువరం రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ‌సరఫరా చేయడంతో పాటు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి 30 కేజీల బియ్యం పథకం అమలు చేసేవారన్నారు.

రాష్ట్రంలోని ఏ వర్గమూ కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయాల పట్ల సంతృప్తిగా లేదని శ్రీమతి షర్మిల అన్నారు. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఆమె విమర్శించారు. పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసినా బతికే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శ్రీమతి షర్మిల వద్ద తమ బాధలు చెప్పుకున్నారు. రోజుకు ఐదు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడంలేదని ‌వారు శ్రీమతి షర్మిలకు చెప్పారు. పింఛన్లు రావడంలేదని కొందరు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని మరికొందరు తెలిపారు. విద్యుత్ కోతలు, అధిక బిల్లులు, పెరిగిన ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో‌ తామంతా అల్లాడిపోతున్నామని శ్రీమతి షర్మిల ముందు వారు ఆవేదన వ్యక్తంచేశారు.
Back to Top