జగన్, విజయమ్మ రాజీనామా

హైదరాబాద్ 10 ఆగస్టు 2013:

ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీ పదవికీ, పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే పదవికీ రాజీనామాలు సమర్పించారు. ఈ విషయాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం సాయంత్రం లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. వారిద్దరూ స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను పంపినట్లు వివరించారు.  తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన రెడ్డి తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకరుకు ఫాక్సు ద్వారా పంపారని చెప్పారు.  తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వారు రాజీనామా చేసినట్లు తెలిపారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ రాజీనామాకు కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ బహిరంగ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాను ఎంపీ పదవికీ, మా పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్రం వ్యవహరించాలని తమ పార్టీ ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేకపాటి ప్రస్తావించారు. అలా చేయలేని పరిస్థితి ప్రస్తుతం ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో రాజీనామాలు చేయక తప్పలేదని ఆయన వివరించారు. తెలంగాణ పట్ల తమకు పూర్తి గౌరవముందని స్పష్టంచేశారు. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిందనీ, ప్రభుత్వ కమిటీకి పూర్తిగా సహకరిస్తామన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీల పట్ల తమకు ఎంతో గౌరవముందన్నారు. ఎవరో సంఘ విద్రోహ శక్తులు వాటి ధ్వంసానికి పాల్పడి తమపై ఆరోపణలు చేస్తున్నారనీ, తమ పార్టీ అలాంటి పనులు చేయదనీ మేకపాటి స్పష్టంచేశారు. ప్రజలను ఇరుకులో పెట్టేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు తాము నిరసన తెలుపుతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు  డాక్టర్ ఎం.వి. మైసూరా రెడ్డి చెప్పారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన ఆరోపించారు.  ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తోందన్నారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని ఎప్పుడో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తాము  లేవనెత్తిన అభ్యంతరాలనే పది రోజుల తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిపారు. మీడియా  సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, జ్యోతుల నెహ్రూ, మేకతోటి సుచరిత, అమర్నాథరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, రాజేష్, జోగి రమేష్, వాసిరెడ్డి పద్మ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గుర్నాధరెడ్డి, శ్రీనివాసులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీమతి విజయమ్మ, శ్రీ జగన్మోహన్ రెడ్డి తమ రాజీనామాలకు కారణాలను వివరిస్తూ రాసిన బహిరంగ లేఖను స్పెషల్ స్టోరీస్ విభాగంలో చదవవచ్చు.

Back to Top