జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం

హైదరాబాద్ 24 సెప్టెంబర్ 2013:

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.  నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు  శ్రీ జగన్కు సోమవారం సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన పూచీకత్తులు సమర్పించిన తరువాత శ్రీ జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు మంగళవారం సంతకం చేశారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు.  కోర్టు ఆదేశాలను పరిశీలన తర్వాత జైలు అధికారులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విడుదల చేశారు. గతంలో ఉన్న విధంగా ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని,  భద్రతా సిబ్బందిని  సమకూర్చింది. శ్రీ జగన్ విడుదల సందర్భంగా జైలు వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జైలు వద్ద కోలాహలంగా ఉంది. చంచల్గూడ జైలు పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. శ్రీ జగన్ బయటకు రాగానే  అభిమానుల ఆనందానికి హద్దులులేకుండా పోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీ జగన్ నవ్వుతూ ప్రజలకు అభివాదం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటకీ అభిమానులను అదుపు చేయడం కష్టమైపోయింది. ఆయన కాన్వాయ్ రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అభిమానులు ఆయనతో కరచాలనానికి పోటీలు పడ్డారు. కాన్వాయ్ వెంట పార్టీ శ్రేణులు కాలినడకన వస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top