ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు

సాలూరు (విజయనగరం జిల్లా):

2019వ సంవత్సరం వచ్చే సరికి రాష్ట్రంలో ఇల్లు లేని ఒక్క నిరుపేద కూడా లేకుండా చేస్తానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చిన మేరకు రానున్న ఐదేళ్ళలో రాష్ట్రంలో 50 లక్షల పక్కా ఇళ్ళు నిర్మించి ప్రతి కుటుంబానికి ఇంటి సౌకర్యం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ జగన్‌ మంగళవారంనాడు విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన 'వైయస్ఆర్‌ జనభేరి' బహిరంగసభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

శ్రీ వైయస్‌ జగన్‌ ఇంతకు ముందు ఇచ్చిన ఐదు హామీలతో పాటు రాష్ట్రంలోని నిరుపేదలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి మరో ఐదు కొత్త హామీలను కూడా సాలూరు సభలో ఆయన ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలు కడుతున్న నెలవారి బిల్లు ఎంతో.. సర్‌చార్జి ఎంతో కూడా అర్థం కావడం లేదన్నారు. పేదలు ఒక్కొక్క ఇంటికి రూ.400 నుంచి రూ.500 వరకు బిల్లులు కట్టాల్సి వస్తోందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పేద వ్యక్తీ ఇబ్బందులు పడక్కర్లేకుండా చేస్తానన్నారు. రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు, ఒక టీవీ వాడితే 150 యూనిట్లు ఖర్చవుతాయని, ఆ విద్యుత్‌ను కేవలం రూ.100కే సరఫరా చేస్తానని శ్రీ జగన్ ప్రకటించారు. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక రాజన్నదొర, అరకు పార్లమెంటరీ స్థానంలో పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను శ్రీ జగన్ ప్రకటించారు.

నిరుపేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తానని శ్రీ జగన్‌ భరోసా ఇచ్చారు. రైతులకు పగటిపూట 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేస్తామని, ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను నియమించి మద్యం సరఫరా జరగకుండా పర్యవేక్షణ చేయిస్తామని అన్నారు. విద్యార్థులు, యువతీ యువకులకు ఉద్యోగాల కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామన్నారు.

చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఎన్నికల హామీలలోని డొల్లతనాన్ని శ్రీ వైయస్‌ జగన్‌ బట్టబయలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు భారీ స్థాయిలో అమలు సాధ్యంకాని హామీలివ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆయన తొమ్మిదేళ్ళ పాలనలో అడ్డుపడిందేమిటని ప్రశ్నించారు. వృద్ధుడైన చంద్రబాబు నాయుడికి ఇవే చిట్టచివరి ఎన్నికలవడంతో మతి తప్పి ఏదేదో మాట్లాడేస్తున్నారని శ్రీ జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడి కంటే తాను 25 ఏళ్ళ చిన్నవాడైన తాను ప్రజలతో మమేకమై మరో 30 ఏళ్ళ పాటు ఉంటానని, ఆయనలా అబద్ధపు హామీలివ్వబోనని, అమలు చేసే హామీలు మాత్రమే తాను ఇస్తున్నానన్నారు.

చరిత్రను మారుస్తా :

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపై తాను పెట్టబోయే ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మార్చివేస్తానని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. ఏ అక్కా చెల్లీ బతకడం కోసం చదువుతున్న తన పిల్లలను పనికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా చేస్తానన్నారు. అక్కా చెల్లెళ్ళు తమ పిల్లలను బడికి పంపితే వారిని ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. బడికి పంపే ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ.1,000 బ్యాంకు అకౌంట్లో జమచేస్తానని హామీ ఇచ్చారు. అందుకోసమే 'అమ్మ ఒడి' పథకానికి సంతకం చేయబోతున్నానని చెప్పారు.  ప్రతి స్కూల్లో  ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా‌నన్నారు.

పైనున్న మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి గర్వపడేలా అవ్వాతాతలకు ఇ‌చ్చే రూ.200 పింఛన్‌ను రూ.700 కు పెంచుతానని శ్రీ జగన్‌ భరోసా ఇచ్చారు. రైతన్నలు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు. ఈ మూడో సంతకంతో ఇకపై ఏ అన్నదాతకూ మద్దతు, గిట్టుబాటు ధర సమస్య లేకుండా చేస్తానన్నారు.

నాలుగో సంతకం మళ్లీ అక్కా చెల్లెళ్ల కోసమే పెడతానని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో రేషన్ కార్డు, పెన్ష‌న్ కార్డు‌లు లేవనే సమస్య ఉండకుండా చేస్తానన్నారు. అందుకే, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఇళ్లు లేని వారంద‌రూ ఏ కార్డు కావాలన్నా వారి వార్డు, వారి గ్రామంలోనే ఆఫీసు తెరిపించి, అక్కడే అన్నీ పెట్టి అడిగిన వారికి 24 గంటల్లో కార్డు వచ్చేలా చేస్తానని పేర్కొన్నారు.

మహానేత వైయస్ ‌మరణించాక రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. వైయస్ఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయం మేరకు ఇళ్లు లేని నిరుపేదలకు వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా. 2019నాటికి ఏ గ్రామంలోనూ ఇల్లు లేని పేదవాడు లేకుండా చేస్తానన్నారు.

ఆరోగ్యశ్రీ నుంచి ఇప్పుడు 133 రోగాలు తొలగించారని శ్రీ జగన్‌ చెప్పారు. 104కి ఫోన్ చేస్తే నాలుగు నెలల నుంచి జీతాల్లే‌‌వు అని సమాధానం వస్తోంది. ఫోన్‌ చేసిన ఇరవై నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు గంట దాటినా వస్తుందో రాదో అనే పరిస్థితి ఉందిప్పుడన్నారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క‌ట్టి, హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరాన్ని తయారుచేసుకుని 20 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు క‌డతామన్నారు. వైయస్ఆర్ గర్వపడేలా ఆరోగ్యశ్రీని గొప్పగా చేసి చూపిస్తాన‌న్నారు. 2019నాటికి కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా మా‌రుస్తానన్నారు. ప్రతి రైతుకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూటే అందిస్తానన్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యాసంస్థల వద్దే బెల్టుషాపులు కనిపిస్తున్నాయని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నారు. కేవలం నియోజకవర్గానికి ఒక్కటే దుకాణం పెడతాం. అది కూడా రేట్లు షాక్ కొట్టేలా ఉంటా‌యన్నారు. చదువుకుంటున్న, చదువు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగం విషయంలో భరోసా ఇస్తున్నానన్నారు. చంద్రబాబులా అబద్ధం చెప్పనని, ఆయన కన్నా మంచి పాలనతో ప్రతి విద్యార్థినీ ఆదుకుంటానని, ఉద్యోగానికి భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు.

Back to Top