పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంది

కృష్ణా జిల్లా దుర్గమ్మ వారధి జనసంద్రమే అందుకు నిదర్శనం
జిల్లా వేదికగా రాష్ట్ర ప్రజానికానికి వరాలజల్లు
ప్రజలను మోసం చేసిన చంద్రబాబు గుణపాఠం తప్పదు
బాబు ద్వంద్వ వైఖరి టీటీడీ కమిటీ నియామకంతో బట్టబయలు
బీజేపీతో ఇంకా అంటకాగుతూ.. పైకి బీరాలు
ఉప ఎన్నికల్లో ఓడిపోతే బాబు తక్షణమే రాజీనామా చేయాలి
చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సవాల్‌

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం చేరే సరికి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారని చెప్పారు. అందుకు తాడేపల్లి నుంచి దుర్గమ్మ వారధి మీదుగా ప్రజలకు వైయస్‌ జగన్‌కు పలికిన స్వాగతమే నిదర్శనమన్నారు. కృష్ణా జిల్లాకు ప్రవేశించిన జననేత వివిధ సామాజిక వర్గాలపై వరాల జల్లు కురిపించారని, వాటన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తారన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో ప్రజా సంకల్పయాత్ర జరిగిందని, 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో, 125 గ్రామాల మీదుగా యాత్ర సాగిందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగసభలు నిర్వహించి స్థానిక సమస్యలపై వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు.
 
2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటనున్న జననేత

ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర 160 రోజులు పూర్తయ్యే సరికి 75 నియోజకవర్గాలు, 125 మండలాలు, 1050 గ్రామాల మీదుగా సాగిందని పెద్దిరెడ్డి చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, 35 ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు, సదస్సులు నిర్వహించారన్నారు. సోమవారంతో ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతుందని, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం ఇందుకు వేదిక కానుందన్నారు. 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన అనంతరం వైయస్‌ జగన్‌ అక్కడ 40 అడుగుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. 

కృష్ణా నుంచి రాష్ట్ర ప్రజానికానికి జననేత ఇచ్చిన హామీలు..

– బందర్‌పోర్టును 4800 ఎకరాల్లో పోర్టు కడతామని చెప్పారు. ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 
– విశ్వబ్రాహ్మణులతో జరిగిన సమ్మేళనంలో అనేక సౌకర్యాలతో పాటు శాసనమండలిలో సభ్యత్వం కూడా ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 
– పెడన నియోజకవర్గంలో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో ప్రమాద బీమా రూ. 10 లక్షలకు పెంచడం జరిగింది. వేటకు ఇచ్చే సెలవుల్లో రెండు నెలలకు ప్రస్తుతం ప్రభుత్వం రూ. 4 వేలు ఇస్తుంది. దాన్ని వైయస్‌ జగన్‌ రూ. 10 వేలకు పెంచారు. 
– గుడివాడ నియోజకవర్గంలో న్యాయవాదుల సమావేశంలో వారికి రూ. 100 కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, రాజధాని ప్రాంతంలో స్థలాలు కూడా ఇస్తామని ప్రకటించారు. 
– కల్వపూడి అగ్రహారంలో నాయీ బ్రాహ్మణులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో క్షౌరశాలలకు 250 యూనిట్లకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని, 500ల యూనిట్ల వరకు కమర్షియల్‌ కాకుండా గృహ కనెక్షన్‌ చార్జీలు ఉండే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. 
– కైకలూరు నియోజకవర్గం పెరికెగూడంలో దళితులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ప్రభుత్వం తరుపు నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. 
– వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 25 పార్లమెంట్‌ జిల్లాలు చేసి కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేస్తామని ప్రకటించారు. 

బాబుకు మతిభ్రమించింది..

వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిభ్రమించిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అందుకే పాదయాత్ర చేసే వారికి గుణపాఠం చెప్పాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికి రూ. 97 వేల కోట్లు ఉన్న అప్పును నాలుగేళ్లలో రూ. 2.26 లక్షల కోట్లకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని మండిపడ్డారు. చేసిన అప్పులతో ఎక్కడైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు కూడా లేవన్నారు. 

అబద్ధాలు సునాయాసంగా చెబుతున్నారు.. 

చంద్రబాబు చేసేది ఒక్కటి.. చెప్పేది మరొకటని రైతుల వడ్డీలకు సరిపడా డబ్బులు ఇవ్వకుండా రైతు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. ఇంకా రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతకు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. 20 వేల పరిశ్రమలు తెచ్చాం అని అబద్ధాలు సునాయాసంగా చెబుతున్నారన్నారు. 40 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉంటుందని ప్రశ్నించారు.
 
రెండు నాలుకల ధోరణి బయటపడింది..

చంద్రబాబుది రెండు నాలుకల ధోరణికి దేవస్థానం కమిటీ నియామకం ఉదాహరణ అని పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రం విడిపోవడానికి నేనే లేఖ ఇచ్చానని వరంగల్‌లో చెప్పిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారణమని చెబుతున్నారన్నారు. అదే విధంగా బీజేపీకి చెందిన మంత్రి సతీమణిని టీటీడీ కమిటీలో మెంబర్‌ను చేశారన్నారు. బీజేపీతో వ్యతిరేకంగా ఉన్నప్పుడు మంత్రి భార్యను ఎందుకు దేవస్థాన కమిటీలో మెంబర్‌ను చేశారని ప్రశ్నించారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు బీరాలు పలుకుతున్నాడన్నారు. బీజేపీతో అంటకాగుతూ వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. 

సవాల్‌కు సిద్ధమా.. 

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదిస్తారని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెబుతూ.. ఉప ఎన్నికలకు పోటీ పెడతామని చెప్పడం శోచనీయమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌ సీపీ స్వాగతిస్తుందని, ఎవరు చిత్తశుద్ధితో హోదా కోసం పోరాడుతున్నారో.. ఉప ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. ఎన్నికలను రెఫరెండంగా తీసుకొని టీడీపీకి డిపాజిట్లు కూడా రాకపోతే చంద్రబాబు తక్షణమే రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. టీడీపీ చేసుకున్న సర్వేలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నారని.. చంద్రబాబే తన చేతగాని తనాన్ని ఒప్పుకున్నారన్నారు. 

రాళ్లదాడిని ఒప్పుకునే ధైర్యం కూడా లేదా బాబూ

రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై జరిగిన రాళ్లదాడి చేయించిన చంద్రబాబు ఒప్పుకునే ధైర్యం కూడా లేదని వైయస్‌ జగన్‌ విమర్శించారని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని, మా వాళ్లే రాళ్లు విసిరారని ఒప్పుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడి వైఫల్యానికి ప్రతీకగా పాదయాత్ర విజయవంతం అవుతుందన్నారు. ఇప్పటి వరకు 8 జిల్లాల్లో పాదయాత్ర జరిగిందని, మిగిలిన 5 జిల్లాల్లో ఇంతకంటే ఎక్కువగా విజయవంతం అవుతుందన్నారు. శ్రీకాకుళం చేరే సరికి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను సృష్టిస్తుందన్నారు. 
Back to Top