ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...జగన్


హైదరాబాద్, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలపై శనివారం శాసనసభలో జరిగిన చర్చ హేయమైన రీతిలో సాగిందని...స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షం గొంతును నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తామని చెప్పడానికి కూడా స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షం ఎంత ప్రాధేయపడినా అసెంబ్లీలో మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని, అధికార పక్షం సభ్యులతో అదే పనిగా మాట్లాడిస్తూ తమపై సత్యదూరమైన ఆరోపణలకు అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చర్చలో స్పీకర్ తమకు అవకాశం ఇవ్వకుండా గొంతులు నొక్కేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసన సభల నుంచి వాకౌట్ చేసిన తరువాత అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదురుగా ధర్నా చేశారు. స్పీకర్ వైఖరిని, అధికారపక్షం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

చర్చను వెటకారం చేస్తున్నారు....

శాంతిభద్రతల పరిస్థితిపై గత రెండు రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న చర్చను స్పీకర్, అధికారపక్ష సభ్యులు వెటకారం చేస్తున్నారని శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము అసెంబ్లీలో చర్చకు తీర్మానం ఇచ్చే నాటికి 11 హత్యలు జరిగాయని, చర్చ కోసం పట్టుపడుతున్న సమయంలో మరో మూడు హత్యలు జరిగాయని చెప్పారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఇద్దరిని, అనంతపురం జిల్లాలో ఒక హత్య జరిగిందన్నారు. ఈ హత్యలన్నీ 4 నెలులు లేదా 6 నెలల కిందనో జరగలేదని...ఎన్నికల తరువాత జరిగినవేనని పేర్కొన్నారు.

హత్యకు గురాన వారి ఫోటోలతో కూడిన పోస్టర్ ను శ్రీ జగన్ ప్రదర్శిస్తూ...'ఇవన్నీ హత్యలు కావా? వంద రోజుల్లోపే జరిగినవి కావా? ఇవన్నీ సాక్ష్యాలతో సహా పత్రికల్లో వచ్చాయి కూడా. హత్యకు గురైన కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారు? ఏ రకమైన అండదండలు అందచేస్తారు? నిష్పాక్షికంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలివ్వండి...అని మేం ప్రశ్నిస్తూ ఉంటే చర్చను దారుణమైన రీతిలో కొనసాగిస్తున్నారు' అని శ్రీ జగన్ మండిపడ్డారు.

'ఈ మూడు నెలల నుంచి జరిగిన 14 హత్యల గురించి చర్చిద్దామని, గతంలోకి పోవద్దని మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా...ఎపుడో పదేళ్ళ కిందటి పాలన గురించి మాట్లాడుతాం అని అధికార పక్షం అంటోంది. గతంలోకి పోతే అవాస్తవాలు మాట్లాడ్డం, ఆరోపణలు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. అసలు సమస్య పక్కదోవ పడుతుందని చెప్పినా వినడం లేదు. ఓ పథకం ప్రకారం మా (ప్రతిపక్షం) గొంతు వినపడకుండా వాళ్ళు (అధికారపక్షం) గొంతులు మాత్రమే వినపడేలా చేస్తున్నారు' అని శ్రీ జగన్ మోహన్ రెడ్డి అధికార పక్షం తీరును తప్పుపట్టారు.

Back to Top