చంద్ర‌బాబు, ఇత‌ర పార్టీ నేత‌ల‌దే త‌ప్పు..!



న్యూఢిల్లీ) ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ వైఎస్సార్‌సీపీ నిర్వ‌హించిన ధ‌ర్నా సంద‌ర్బంగా పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఉద్వేగ భ‌రితంగా ప్ర‌సంగించారు. చంద్ర‌బాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల దుర్నీతిని ఎండ‌గ‌ట్టారు.

కాంగ్రెస్ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ ఏనాడు ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌నే లేద‌ని, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలోకి వ‌చ్చి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌తాన‌ని చెబుతున్నార‌ని అన్నారు. మంట పుట్టించి, త‌ర్వాత నీళ్లు చ‌ల్లే మాదిరిగా క‌బుర్లు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. 

అటు, కేంద్రంలోని బీజేపీకి పాత రోజులు గుర్తుండాల‌ని జ‌గ‌న్ అన్నారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష పార్టీ గా ఉండి పార్లమెంటులో ప్ర‌త్యేక హోదా ప‌ది సంవ‌త్స‌రాలు కావాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తిని మ‌రిచిపోయారా అని వైఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు. త‌మ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్న అడిగినప్పుడు ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ను కొన‌సాగిస్తున్న‌ట్లు జ‌వాబు ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. అటువంట‌ప్పుడు త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు ఉన్న ఇబ్బందులు ఏమిట‌ని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. 

 రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని కోరామని, అయినా బాబు స్పందించలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదామని అడిగినా చంద్రబాబు స్పందించలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని తెలిసినా.. కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. మంగళగిరిలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశామని, ప్రత్యేక హోదా రాదని, ఇక ఉద్యోగాలు రావన్న ఆవేదనతో మునికోటి అనే వ్యక్తి ఆత్మార్పణ చేశాడని జగన్ వివరించారు. 65మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది ప్రజలు అందరూ ఇక్కడకు వచ్చి ధర్నా చేస్తున్నారని, ఇంతమంది ఆవేదన మీకు అర్ధం కావడం లేదా చంద్రబాబూ అని జగన్ ప్రశ్నించారు. 
 

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఐదు కోట్ల రూపాయల ఆఫర్‌తో అడ్డంగా దొరికి పోయి.. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బైటపడేందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని జగన్ అన్నారు. అలా తన స్వార్థం కోసం రాష్ర్త ప్రయోజనాలనే తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఓటుకు కోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వీడియో, ఆడియో టేపులున్నాయని, డబ్బిస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడిన కేసులో చంద్రబాబును ఈ రోజు వరకు ఎందుకు అరెస్టు చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను మాత్రమే కాదని, బిజినెస్‌లైన్ అనే జాతీయ పత్రిక స్వయంగా అడిగిందని ఆ పత్రిక క్లిప్పింగ్‌ను జగన్ చూపించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం విచారణ జరగకుండా చూసుకునేందుకు రాష్ట్రాన్నే ఫణంగా పెట్టారని బిజినెస్‌లైన్ చెప్పిందని జగన్ వివరించారు.  

 గోదావరి ఎప్పుడు పొంగినా పోలవరం ప్రాజెక్టుతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ నీళ్లతో రాష్ర్టమంతా బాగుపడే అవకాశం ఉంటుందని జగన్ వివరించారు. కానీ చంద్రబాబు లంచాలు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారని జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ తప్ప ఏమీ జరగడం లేదని, పదేపదే దీని గురించి  ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని చంద్రబాబుకు కేంద్రం గడ్డిపెడుతూ లేఖ రాసిందని జగన్ తెలిపారు. ఎడమకాలువలో కూడా కాంట్రాక్టర్ పనులు చేయట్లేదని కేంద్రం రాసిందని, కానీ చంద్రబాబు ఇదే కాంట్రాక్టరుకు రు.290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజె క్టు మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఏంటి.. కాంట్రాక్టరు బాగోలేదని ఈరోజు గుర్తుకొచ్చిందా.. అడ్వాన్సు ఇచ్చేటపుడు గుర్తురాలేదా.. అని చంద్రబాబును జగన్ నిలదీశారు. కాంట్రాక్టులు చేసేది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మరింత దోపిడీ జరుగుతోందని జగన్ విమర్శించారు.
Back to Top