రైతు దీక్ష ప్రారంభించిన వైఎస్ జగన్


పశ్చిమగోదావరి: ఎన్నికల హామీలను గాలికొదిలే సిన అధికార పార్టీ రైతులను, మహిళలను వంచిస్తున్న తీరుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతుదీక్ష చేపట్టారు. రెండు రోజుల పాటు ఆయన దీక్ష చేయనున్నారు. ముందుగా ఆయన దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షకు విచ్చేసిన వారికి వైఎస్ జగన్ అభివాదం చేసి దీక్షలో కూర్చున్నారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వేదికపై దీక్షలో కూర్చొని  సంఘీభావం తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చేరుకున్నారు. పట్టణంలోని రైతుదీక్షా స్థలికి చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపుడి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తణుకు వచ్చారు. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.  వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీ నాగిరెడ్డి,  వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, ధర్మాన ప్రసాదరావు, లక్ష్మీపార్వతి, తలశిల రఘురాం, ఆళ్లనాని, అంజాద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Back to Top