బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది: జగన్

హైదరాబాద్, ఆగస్టు 20: 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. రుణాల మాఫీపై కోట్లాది మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లారు' అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ పై శ్రీ జగన్ విలేకరులతో మాట్లాడారు. 'ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలే రూ.1.02 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా చేనేత కార్మికుల రుణాలూ ఉన్నాయి. ఈ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు...బడ్జెట్ లో ఇందుకోసం చేసిన కేటాయింపులు సున్నా' అని విమర్శించారు.

'రాష్ట్ర విభజన తరువాత ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చంద్రబాబు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా మేనిఫెస్టోలను విడుదల చేశారు. అన్ని రుణాలు మాఫీ చేస్తానని వాటిలో చెప్పారు. ఇదిగో బాబు వస్తున్నారు...రుణాలన్నీ మాఫీ అయిపోతాయని అన్ని ప్రచార సాధనాలనూ వాడుకుని ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు రాసిన లేఖలో కూడా రుణాల మాఫీ హామీపై పూర్తి అవగాహన ఉందని ఆయన చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాదే ఈ వాగ్దానం చేశానని లిఖితపూర్వకంగా చంద్రబాబు చెప్పారు.

తొలి సంతకంతోనే రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. కానీ 1.02 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలుంటే బడ్జెట్ లో మాత్రం వాటికి ఎలాంటి కేయింపులు లేవు. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, చేనేత కార్మికులతో సహా ప్రజలందరినీ ఈ బడ్జెట్ నిరుత్సాహపరచింది. గృహ నిర్మాణానికి 800 కోట్లు మాత్రమే కేటాయించడం అతి దారుణం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి ఏటా బలహీనవర్గాల గృహ నిర్మాణానికి 7 వేల నుంచి 8 వేల కోట్ల రూపాయలు కేటాయించేవారు. ఈ బడ్జెట్ లో గృహ నిర్మాణ శాఖకు కేవలం 800 కోట్ల రూపాయలకు దిగజారింది. ఈ కేటాయింపులు చూస్తే ఈ ఏడాది బలహీనవర్గాల వారికి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించబోరనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఇంటి నిర్మాణానికి 1 లక్ష నుంచి 1.4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖకు చేసిన కేటాయింపుల్లో జీతభత్యాలకు పోగా ఇక ఏం మిగులుతుంది? ఏం ఇళ్ళు కడతారు' అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top