కోటి పరిహారం ఇవ్వాలి: జగన్

నగరం, జూన్ 28: నగరం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు నష్ట పరిహారంగా కుటుంబానికి ఒక కోటి రూపాయలు చొప్పున చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో పైపులైన్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా ఉండాలంటే విదేశాల్లో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు భయం పుట్టేలా పరిహారం ఇప్పించాలి. ఒక్కసారి ఇతర దేశాలకు వెళ్ళి చూడండి. అక్కడ ఇలాంటి ఘనటలు జరిగినప్పుడు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకు ఆ కంపెనీలకు, యాజమాన్యాలకు భయం కల్పించేందుకు వాళ్ళు ఇస్తున్న పరిహారం లెక్క చూడండి.

నగరం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఎంతమాత్రం సరిపోదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్ కు కానీ, ఓఎన్జీసీకి కానీ ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి' అని శ్రీ జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరచి, కేజీ బేసిన్ లో మనకు రావాల్సిన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Back to Top