హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్

హైదరాబాద్, జూన్ 23: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన అనేక వాగ్దానాల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. 'ఎన్నికలకు ముందు మీరిచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ హామీలు నెరువేరుస్తారని కోట్లాది మంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా చెల్లెమ్మలు రుణాల మాఫీ అవుతాయని ఆశగా ఉన్నారు. మీరేమో కమిటీలంటూ కాలయాపన చేయడం సమంజసంగా లేదు' అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరును కడిగిపారేశారు.

రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ల పెంపు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రీయింబర్సమెంట్, 9 గంటలపాటు ఉచిత కరెంటు వంటి ఎన్నికల్లో ఇచ్చిన గామీలు అమలు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో శ్రీ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ప్రతిపక్ష సభ్యులపై ముందే దాడికి సిద్ధమైన రీతిలో 17సార్లు అధికారపక్ష టీడీపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. 'మీరు మాట్లాడినప్పుడు మేం శ్రద్ధగా విన్నాం. మీరు కూడా మా ప్రసంగం పూర్తయ్యాక స్పందించవచ్చు. అంతేకానీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేది వినడానికి కూడా ఓపిక లేదంటే ఎలా? అంటూ శ్రీ జగన్ ప్రశ్నిస్తూ అక్కడక్కడా అధికారపక్షానికి చురకలంటిస్తూ తన ప్రసంగం కొనసాగించారు

Back to Top