దామోద‌రం సంజీవ‌య్యకు ఘ‌న నివాళి

క‌ర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోద‌రం సంజీవ‌య్య జ‌యంతి వేడుక‌లు క‌ర్నూలులో ఘ‌నంగా నిర్వ‌హించారు. న‌గ‌రంలోని సంజీవ‌య్య విగ్ర‌హానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించార‌న్నారు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబంలో చివరి సంతానం దామోదరం సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేత పని, రోజు కూలి చేస్తూ జీవించేవార‌న్నారు.  లా పట్ట తీసుకుని సంజీవయ్య 1950 అక్టోబర్‌లో మద్రాసు బార్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారని తెలిపారు.  లా అప్రెంటీస్‌ చేస్తున్న సమయంలో వివిధ రాజకీయ నాయకుల పరిచయం, సాంగత్యం వలన రాజకీయాల్లో ప్రవేశించార‌న్నారు. సంజీవయ్య మంచి వక్త. తెలుగులో, ఇంగ్లీషులో ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి  సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని ఎమ్మెల్యే ఐజ‌య్య కొనియాడారు.


ద‌ళితుల అభ్యున్న‌తికి దామోద‌రం సంజీవ‌య్య చేసిన కృషి మ‌రువ‌లేనిద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య జ‌యంతి వేడుక‌ను క‌ర్నూలులో వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని సంజీవ‌య్య విగ్ర‌హానికి ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిగా సంజీవ‌య్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.
Back to Top