రైతుల పక్షాన పోరాడి గెలిచిన వైఎస్సార్ సీపీ

రైతుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ నేతలు
రెండో పంటకు సుముఖత వ్యక్తం చేసిన సర్కారు
రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండతోనే సాధ్యమైందని స్పష్టీకరణ


మంగళగిరి: రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో అంగీకారపత్రాలు ఇవ్వని వారు నిరభ్యంతరంగా రెండో పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంపై  రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో రెండో పంటకు అనుమతి లేదన్నారు. దీంతో రాజధాని గ్రామాలతోపాటు అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై వ్యతి రేకత వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. రెండో పంట వేస్తే తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే వినూత్నరీతిలో నిరసనలు తెలుపుతూ రైతులకు అండగా నిలిచారు. ఓ రోజంతా కూలీగా పొలం పనులు చేశారు. ఉల్లిపాయల బస్తాలు మోశారు. లోడు లారీని నడిపారు. మరో రోజు భిక్షాటన చేశారు. ఇలా ఆందోళనలో రైతుల వెన్నంటి నిలిచారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన, మరో వైపు ఈ అంశం రాష్ట్రం దాటి దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనకడుగు వేసింది. సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో మాత్రమే పంటలకు అనుమతి లేదని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ మంగళవారం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అండగా నిలవడంతోనే నేడు రెండో పంటకు మార్గం సుగమం అయిందని చెపుతున్న రైతులు వాపోయారు

Back to Top