రాజ్యాంగ విరుద్ధంగా గిరిజన సలహామండలి

  • ఎమ్మెల్యేలు కాని వారిని కమిటీలో ఎలా నియమిస్తారు..?
  • జన్మభూమి కమిటీల్లా ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీ
  • వైయస్ఆర్ ఎస్టీలకు 26 లక్షల భూ పంపిణీ చేశారు
  • గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా బాబూ?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తెల్లం బాలరాజు
హైదరాబాద్‌: రాజ్యాంగ విరుద్ధంగా సీఎం చంద్రబాబు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. గిరిజనుల సంక్షేమం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో సలహామండలి ఏర్పాటును బట్టి అర్థం అవుతుందని మండిపడ్డారు. కమిటీలో గిరిజన ఎమ్మెల్యేలకు చోటు కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెల్లం బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో గిరిజనులపై ప్రేమ కురిపించే చంద్రబాబు.. వారితో ఓట్లు వేయించుకున్న తరువాత వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గిరిజన శాసనసభ్యులు ఆరుగురు ఉన్నారనే ఇనాళ్లు గిరిజనల సలహామండలిని నియమించకుండా తాత్సారం చేశారన్నారు. 

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు
రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎమ్మెల్యేలు కానివారిని 8 మందిని కమిటీలో నియమించారని బాలరాజు మండిపడ్డారు. 5వ షెడ్యుల్‌ ప్రకారం గిరిజన సలహా మండలిలో 20 మంది సభ్యులు ఉంటే వారిలో 4/3 వంతు ఎస్టీ సభ్యులు ఉండాలన్నారు. సలహా మండలి అంటే చంద్రబాబుకు విలువ లేకుండా పోయిందన్నారు. బాబే రాజ్యాంగాన్ని రచించినట్లుగా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. గిరిజనులకు తెలివి తక్కువ, వారు కొండల్లో, కోనల్లో ఉంటారని మాట్లాడిన చంద్రబాబు వారిని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు. గిరిజన సలహా మండలి ....చంద్రబాబు తన అక్రమాల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలా ఉందని విమర్శించారు. 

గిరిజనుల సమస్యలు సర్కార్‌కు పట్టవా..?
చంద్రబాబు మోసాలను గిరిజన ప్రజలు గ్రహించాలని, ఎలా మోసం, దగా చేస్తున్నాడో ఆలోచించుకోవాలని తెల్లం బాలరాజు సూచించారు. నేటికీ కరెంట్, రోడ్డు సౌకర్యం లేని అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రత్యేక విమానాల్లో తిరగడానికి, ఇల్లు, గెస్ట్‌హౌస్‌లు మరమ్మతులు చేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు గిరిజన ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో 50 ఏళ్లు దాటిన గిరిజనులకు పెన్షన్‌ ఇస్తాననని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాడని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 5 విడుతలుగా 32 లక్షల భూ పంపిణీ చేపడితే దాంట్లో ఎస్టీలకు 26 లక్షల ఎకరాలు పంచారని గుర్తు చేశారు. చంద్రబాబు భూములు ఇవ్వకపోగా గిరిజనుల వద్ద ఉన్న భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా గిరిజన సలహామండలి ఏర్పాటు చేశారని, 20 మంది సభ్యుల కమిటీలో వివిధ పార్టీలకు చెందిన వారిని 15 మందిని నియమించారన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసిన మహానేత వైయస్‌ఆర్‌ అన్నారు. కానీ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో గిరిజనులు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top