పోలవరంతో వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: కొడాలి నాని

హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా పేదలకు ఒక్క ఇంటికి కూడా రుణం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్ఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు ఘనత వైఎస్ రాజశేఖరెడ్డిదని, ఇప్పుడు పులిచింతల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తైతే వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదన్నారు. ఆయన చనిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. పోలవరం చెడగొట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రుణాలు మాఫీ కాకుండానే సన్మానాలు చేయించుకుంటున్నారని, ఒక్క మహిళకు రుణమాఫీ చేసినట్టు నిరూపించితే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్రం నిర్మించాలన్నారు. కేంద్రం నిర్మిస్తే తమకేమీ రాదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామంటోందని ఆరోపించారు.


Back to Top