నేడు శాసనసభకు బ్లాక్ డే: వైఎస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన సభ చరిత్రలో బ్లాక్ డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, చాంద్ బాషా అన్నారు. సభలో ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు స్పీకర్ వంత పాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్బండ్పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలపై నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం జగన్కు పదే పదే అడ్డుతగులుతున్నారని చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. సభ్యుల అంతు చూస్తామని బెదిరించడం అధికార పక్ష సభ్యుల రౌడీయిజాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహించడం సిగ్గు చేటని చెప్పారు.
Back to Top