నీరు ప్రగతి కాదది...చంద్రబాబు దోపిడీ పథకం

రాజకీయ విలువలై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు

బిజెపితో చాటుమాటు వ్యవహారాలు చేస్తున్నది టిడిపినే

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వైయస్ఆర్ సిపి కి లేదు

ప్రకాశం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా బిజెపితో కలిసి కాపురం
చేసి, ఇంకా బిజెపితో చాటుమాటు వ్యవహారాలు నడుపుతూ, ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ , బిజెపితో
కుమ్మక్కైందంటూ చేస్తున్న విమర్శలు గర్హనీయమని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ కు ఏ పార్టీతోనూ పొత్తు
పెట్టుకోవాల్సిన అవసరం లేదనీ, ఇంతకు ముందు పెట్టుకోలేదని, కానీ చంద్రబాబు నాయుడు
చరిత్ర మొత్తం ఎవరో  ఒకరి అండతోనే గెలిచినదే
అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన ద్వంద విధానాలతో ప్రజలను మోసం చేస్తూ
రాజకీయాలను వ్యాపార సంస్థలుగా మార్చి చేస్తున్న అవినీతిని ఇతరులకు ఆపాదించడం సిగ్గుచేటన్నారు.
ఇది గురివింద ...సామెతలా ఉందన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రకాశం జిల్లా పార్టీ
కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నీరు ప్రగతి కార్యక్రమానికి చంద్రబాబు దోపిడీ పథకం
అని పేరుపెట్టుకుంటే బాగుంటుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వైయస్ ఆర్ కాంగ్రెస్ అభివృద్ధికి అడ్డుపడుతోందంటూ ముఖ్యమంత్రి
చంద్రబాబు ప్రకాశం జిల్లాలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు ప్రకాశం
జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికలు ముందు, ఆ తరువాత ప్రకటించిన
వెటర్నరీ యూనివర్శిటీ, మైన్ యూనివర్శిటీ, నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక హబ్ లు
ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన సభకు హాజరుకాకుంటే, ప్రభుత్వం
నుంచి నిధులు రావంటూ బెదిరించి డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించి ఏదో సాధించామని
గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రకాశం జిల్లాలో రాజకీయ విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం
అర్దరహితమని, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలేమిటో చెప్పడానికి , ఎమ్మెల్సీ శిల్పా
చక్రపాణి రెడ్డి రాజీనామా ఉదంతంమే పెద్ద ఉదాహరణ అని, అన్నారు. ధర్మపోరాటాలు, దీక్షలు
అంటున్న చంద్రబాబు నాయుడు తనమీద, తన కుమారుడు లోకేష్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు
ఎందుకు సిద్ధపడటంలేదని ఆయన ప్రశ్నించారు. 

Back to Top