బాబుది స్కాముల ప్రభుత్వం

– స్కీములన్నీ స్కాములతో మూటగట్టేందుకే 
– స్విస్‌ ఛాలెంజ్‌ ముమ్మాటికీ అంతర్జాతీయ కుంభకోణం
-ఏపీని బాబు సింగపూర్ కు అమ్మకానికి పెట్టారు
– త్వరలో ప్రపంచం నివ్వెర పోయే నిజాలు చూస్తాం
– విలేకరుల సమావేశంలో బాబుపై బుగ్గన ధ్వజం

హైదరాబాద్ః టీడీపీది స్కీముల ప్రభుత్వం కాదని.. స్కాముల ప్రభుత్వమని వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్విచ్‌ చాలెంజ్‌ విధానం లోపభూయిష్టంగా ఉందని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టులు చెప్పినా వినకుండా.... చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుని మూర్ఖంగా ముందుకెళ్లడం సరికాదని బాబుకు హితవు పలికారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబ్లింగ్‌ యాక్టు–2001ను కూడా బాబు తనకు నచ్చినట్టుగా మార్చుకుని సింగపూర్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారని విమర్శించారు.
  
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీలో ఇన్ని మార్పులా
మౌలిక వసతుల కల్పనకు  2001లో రూపొందించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబ్లింగ్‌ యాక్టులో చేసిన సవరణలు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అథారిటీకి చైర్మన్‌గా ఉన్న ఛీఫ్‌ సెక్రటరీకి ఉన్న అధికారాలకు ఒక్కొక్కటిగా ప్రభుత్వం కత్తెర పెట్టిందన్నారు. ఛీఫ్‌ సెక్రటరీతోపాటు ఆర్‌ అండ్‌బి, ఆర్థిక శాఖ, ఐటీ, తదితర విభాగాలకు సంబంధించిన నిపుణులున్న అథారిటీకి అధికారులు లేకుండా చేశారన్నారు. ప్రయివేటు వ్యక్తులను భాగస్వాములను చేస్తూ రాబోయే కాలంలో జరిగే ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేసి బ్యాంకర్ల సాయంతో ప్రణాళికలు రూపొందించి పనులు వేగంగా పూర్తిచేసేందుకు నియమించిన అథారిటీని కూడా లెక్క చేయకపోవడం బాధాకరమన్నారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నుంచి ఉన్న నిపుణులను కూడా కాదని ఇష్టానుసారంగా సెక్షన్‌లను ఎత్తేసి ఆ పేపర్లను కుంకుమ ప్యాకెట్లకు కూడా వాడటానికి పనికిరాకుండా చేశారన్నారు. 

సింగపూర్‌ కంపెనీలు చేసేది ప్లాట్ల వ్యాపారమే 
స్విస్‌ చాలెంజ్‌ పేరుతో వచ్చిన సింగపూర్‌ కంపెనీలు చేయబోయేది ఇక్కడ ప్లాట్ల వ్యాపారమే తప్ప సింగపూర్‌ నగరాన్ని నిర్మించరని స్పష్టం చేశారు. సింగపూర్, జపాన్, చైనా వంటి అద్భుత నగరాలను చూస్తామన్నది భ్రమేనన్నారు. పెట్టుబడి అంతా మనమే పెట్టుకుని ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా, సింగపూర్‌ కంపెనీకి 58 శాతం వాటా ఎందుకో అర్థం కావడం లేదన్నారు. 1691 ఎకరాల భూమి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3వేల కోట్లు, ఏపీ ప్రభుత్వం పెట్టుబడి రూ. 5500 కోట్లు అన్నీ కలుపుకుని మన వాటా దాదాపు 15వేల కోట్లు ఇస్తుంటే కేవలం రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కంపెనీకి 58 శాతం ఇవ్వడం చూస్తుంటేనే ఇక్కడేదో పెద్ద స్కామ్‌ జరుగుతుందని సామాన్యులకు కూడా అర్థం అవుతుందన్నారు. ఇక్కడేదో మతలబు ఉందని స్పష్టమవుతుందన్నారు. ఓవైపు కోర్టులో కేసులు నడుస్తుంటే చట్టాలను తమకు అనుకూలంగా సవరణ చేయడం టీడీపీ పాలనలోనే చూస్తున్నామన్నారు. తొందర్లోనే స్విస్‌ చాలెంజ్‌  కుంభకోణంకు సంబంధించి ప్రపంచమే నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తాయని వెల్లడించారు. 

చట్టాలనే మార్చేశారు
స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొనే కంపెనీలు తదనంతరం జరిగే పరిణామాలపై ఎలాంటి బాధ్యత వహించకుండా నిబంధనలు రూపొందించడంపై బుగ్గన  మండిపడ్డారు. కేవలం రూ. 300 కోట్లు పెట్టుబడులు పెట్టిన సింగపూర్‌ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టడమే ధ్యేయంగా కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే స్విస్‌ చాలెంజ్‌ కుట్రకు బీజం పడిందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి సింగపూర్‌ కంపెనీ ప్రతినిథులకు రాష్ట్ర ప్రతినిథులకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను తెలియజేశారు. రైతుల నుంచి సేకరించిన 1700 ఎకరాల భూమి, వేల కోట్ల పెట్టుబడులు పెట్టి కూడా ఏదైనా జరగరానిది జరిగితే సదరు కంపెనీలను ప్రశ్నించే అధికారం కూడా ప్రభుత్వాలకు లేకుండా తమకు అనుకూలంగా చట్టాలు రూపొందించారని ధ్వజమెత్తారు. 

విదేశీ కంపెనీ అయితే అర్హత ఉన్నట్టా 
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీలో మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బుగ్గన ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే విదేశీ కంపెనీ అయితే చాలా.. ?ఆయా కంపెనీలకు సమర్థత ఉందో లేదో చూసుకోరా అని అడిగారు. హైకోర్టు వ్యతిరేకించిన స్విస్‌ చాలెంజ్‌పై చట్టాలను కాదని ఎందుకు ముందుకెళ్తున్నారో ప్రజలకు తెలియాలన్నారు. బిడ్డింగ్‌కు ఆసక్తి ఉన్న కంపెనీల విధివిధానాల రూపకల్పనలో చేసిన మార్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసక్తి ఉన్న కంపెనీల స్థానంలో ‘అర్హత’ పేరుతో చేసిన మార్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

మన ఇంజనీర్లు కడితే మురికివాడలా
దేశీ ఇంజినీర్లు మురికివాడలే కడతారు.. విదేశీయులైతే బ్రహ్మాండమైన ప్రాజెక్టులు నిర్మిస్తారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన మాటలను బుగ్గన ఖండించారు. అలాంటప్పుడు ఇటీవల చైనా, అమెరికాలో నగరాలకు నగరాలే మునిగిపోయిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులకు ఎవరూ అతీతులు కారని, ఎవరైనా తల వంచాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దానికే మన ఇంజనీర్లను అవమానిస్తూ మాట్లాడటం తగదన్నారు. ఒకానొక సందర్భంలో కోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ ఓ కేసు విషయంలో మన ఇంజనీర్లను గాడిదలతో పోల్చడంపై ఆయన ఆక్షేపించారు. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజల్లో మాట్లాడేటప్పుడు ముందూ వెనకా చూసుకోవాలని హితవు పలికారు. మనదేశ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటుంటే వారి గురించి మనమే చులనకనగా మాట్లాడటం తగదన్నారు. క్షిపణులు, రాకెట్ల తయారీలో మనం ప్రపంచ స్థాయిలో ఎంతగా పురోగమించామో గుర్తుంచుకోవాలన్నారు.  

బాబును పాలన చూసి జనం నవ్వుతున్నారు
బాబు పాలనను చూసిన జనానికి ఆగ్రహావేశాలు చల్లారిపోయి నవ్వుకుంటున్నారని తెలిపారు. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజా బ్యాలెట్‌లో ప్రశ్నలు చదివి ఈ హామీలు ఎప్పుడు తీర్చారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారని వెల్లడించారు. గొప్పవాడు ఏడవడు... ఏడిపిస్తాడు, నవ్వడు.. నవ్విస్తాడు.. వడ్డించేవాడు ఎందుకు తింటాడు అంటూ ఛలోక్తి విసిరారు. బాబు పరిపాలనపై ప్రజలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని, ముగింపు పలకడమే మిగిలుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆస్తుల ప్రకటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... హైదరాబాద్‌లో ఉన్న ఆయన భవనాన్ని కట్టిన విలువకి అమ్మాలనుకుంటే మరో లక్ష రూపాయలు ఎక్కువైనా ఇచ్చి కొనేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 
 
Back to Top