ఇది ప్రజాతీర్పు కాదు... ప్రలోభాల తీర్పు

  • అడ్డదిడ్డంగా గెలిచి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలతో గెలిచిన టీడీపీ
  • నిరుత్సాపడాల్సిన పనిలేదు ప్రజలంతా మనవైపే
  • మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్‌
  • ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు
వెలగపూడి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలతో అడ్డదిడ్డంగా గెలిచి.. విజయం సాధించామని చంద్రబాబు సర్కార్‌ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల తీర్పుతో గెలిచిన ప్రజాప్రతినిధులను మాకున్న డబ్బు బలంతో కొనుగోలు చేయడమే మాకు చేతనైతుందనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను పోలీసుల సహాయంతో బలవంతంగా క్యాంపులకు తీసుకెళ్లారని విమర్శించారు. ప్రజాప్రతినిధులతో వారి మతగ్రంధాలపై ఒట్లు పెట్టించుకొని చెక్కులు విడుదల చేసి బాండ్‌ పేపర్‌ రాయించుకున్న ఘనత టీడీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నిజంగా ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ నుంచి లాక్కున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.. ప్రజలు ఎవరి తరుపున ఉన్నారో అర్థం అవుతోందని సవాలు విసిరారు. టీడీపీ ప్రలోభాల విజయం ప్రజాస్వామ్యానికే మచ్చ అని వ్యాఖ్యానించారు. ఈ రకమైన పరిపాలన చేయాలని మాకుంటే దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలోనే టీడీపీ భూ స్థాపితం అయ్యేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యరీతిలో పరిపాలించాం కానీ దుర్మార్గంగా పరిపాలించలేదని ఫైరయ్యారు. ఎక్కడ పొరబాటు జరిగిందో బేరీజు వేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కాకపోయినా భవిష్యత్తులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అతిశక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన పనిలేదన్నారు. 

మైనార్టీలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటైనా చేశారా?
చంద్రబాబు సర్కార్‌ మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం.. మైనార్టీలను అభివృద్ధిలోకి తెస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ముస్లిం మతగురువులకు నాలుగు, ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు జీతాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మైనార్టీలకు ఒక్కటైనా ఉపయోగపడే కార్యక్రమం చేశారా అని ప్రశ్నించారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కృషి చేశారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో మైనార్టీలకు ఉన్న 12 శాతం రిజర్వేషన్‌ మన రాష్ట్రంలో పెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయిందన్నారు. వ్యవస్థలు టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించడం హేయనీయమన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విజయనగరం జిల్లాలో ఇంకా వైయస్‌ఆర్‌ సీపీ నేతల పనులు జరుగుతున్నాయా అని మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 
Back to Top