ప్రభుత్వానిదే తప్పు


* రైలు ప్రమాదాలపై వైయస్‌ జగన్‌ ఆగ్రహం
* రైల్లో వెళ్లాలంటేనే భయం వేస్తోంది
* ప్రయాణికుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి
* మృతుల కుటుంబాలకు తోడ్పాటునిద్దాం
* ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి
* గాయపడిన వారికి కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలి
* కూనేరు వద్ద రైలు ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ 

కూనేరు: దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో సంభవించిన రైతు ప్రమాదం విద్రోహచర్య అయినా, రైల్వేశాఖ తప్పయినా.. అసలు తప్పు మాత్రం ప్రభుత్వానిదేనని ఆయన ధ్వజమెత్తారు. గమ్యం చేరుకోకుండానే ప్రయాణికులు మరణించడం దారుణమని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కూనేరు వద్ద రైలు ప్రమాదం సంభవించిన సంఘటనా స్థలాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙సోమవారం సాయంత్రం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ తీరును ఎండగట్టారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గడిచిన మూడు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరిగాయని, ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్పూర్‌ వద్ద రెండు ప్రమాదాల్లో వంద మంది, విజయనగరం ప్రమాదంలో దాదాపు 50 మంది రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డారన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో మూడు ప్రమాదాలు సంభవించాయని, అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు తానే స్వయంగా వెళ్లి సంఘటన స్తలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించానన్నారు. రైలు ప్రమాద బాధితులకు ఏదో నామమాత్రంగా కాక.. కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా మృతుల కుటుంబాలకు తోడ్పాటునందించాలన్నారు. ఒక్కో కుటుంబానికి  కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇచ్చినా తక్కువే అన్నారు. రైలెక్కాలంటే ఒక నమ్మకం రావాలని.. ప్రభుత్వం, రైల్వేశాఖ నుంచి పరిహారం భారీగా వస్తేనే ప్రజలకు ఆ నమ్మకం కుదురుతుందని వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఇస్తున్న రూ.25 వేలు, 50 వేలు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో మన రాష్ట్రానికి చెందిన వారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగిందన్నారు. గాయపడిన వారంతా కూడా పేదలే అన్నారు. వాళ్లు మూడు నాలుగు నెలల పాటు మళ్లీ పనుల్లోకి వెళ్లలేరని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం చికిత్సకు మాత్రమే సరిపోయేలా కాకుండా వాళ్లకు కూడా మానవతా దృక్పథంతో కనీసం రూ.2 లక్షలు పరిహారం ఇవ్వాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో విచారణ జరిపామని వెళ్లిపోతారు తప్ప ప్రజలను ఆదుకున్నట్లు ఎక్కడా కనిపించదని అన్నారు. పట్టాలు కూడా నిజంగా పాతవే అయితే వాటిని యుద్ధప్రాతిపదికన మార్చాలని ఆయన కోరారు. ఈ ఘటనపై విచారణ గట్టిగా జరగాలని, ఆ నివేదికలను బహిర్గతం చేసి రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఏం చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో  కూడా చెప్పాలని అన్నారు. రైల్వే శాఖలో భద్రతా చర్యలు మెరుగుపడాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఆయన వెంట పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, విజయనగరం జిల్లా నాయకులు ఉన్నారు.

Back to Top