హోదా కోసం పోరాడడం నేరమా..?

  • ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోంది
  • ప్రత్యేకహోదా ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష
  • ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు
  • హోదా కోసం ఎంతదూరమైనా వెళ్తాం..వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
  • పిలిచిన వాళ్లకు లేకపోతే..జ్యోతులకైనా సిగ్గుండాలి
  • ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
  • మా నాయకుని నేతత్వంలో పోరాడి హోదాను సాధిస్తాంః పిన్నెళ్లి
హైదరాబాద్ః ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదా కోసం తాము అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తే..అధికార టీడీపీ తమను ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతోందని వైయస్సార్సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత తమపై ఉందని, అయితే అసెంబ్లీలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  హోదా కోసం తమ నాయకుడు వైయస్ జగన్ నేతృత్వంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామని,  వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రజలంతా హోదా కావాలని కోరుకుంటున్నారని, హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారని పిన్నెళ్లి తెలిపారు. ఇటీవల శాసనసభలో జరిగిన పరిణామాలపై ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ...మూడు రోజుల సమావేశాల్లో మా నాయకుడు మాట్లాడడానికి కనీసం ఒక్క నిమిషం కూడా మైక్ ఇవ్వకపోవడం దారుణమని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.  ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర పెట్టి బాబు ప్యాకేజీని స్వాగతించిన తీరుకు నిరసినగానే తాము సభలో హోదా గళం వినిపించామని చెప్పారు. మమ్మల్ని మాట్లాడనీయకుండా బాబు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని పిన్నెళ్లి చెప్పారు.  ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాభిప్రాయాన్ని సభలో ప్రతిబింబిస్తే, తామేదో నేరం చేసినట్లు.... ప్రభుత్వం తమను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని పిలవడం చాలా బాధించిందని పిన్నెళ్లి అన్నారు. ఇటీవల సభ జరిగిన సమావేశాల్లో అసలు ఏం జరిగిందో ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వకుండా ప్రవిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని పిలవడం దారుణమన్నారు. 

నోట్ల రద్దు మార్పిడి విషయంలో ప్రస్తుతం పార్లమెంట్ లో జరుగుతున్న తీరును చూస్తున్నాం. ఏదైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా నిరసన కార్యక్రమం తీసుకుంటారు. ఆ విధంగానే హోదా కోసం తాము ప్రజల తరపున నిరసన తెలిపాం  తప్ప తమకు వేరే అజెండా ఏదీ లేదని స్పష్టం చేశారు. తమను సస్పెండ్ చేసేందుకు పరోక్షంగా బయపెట్టలాని చూస్తున్నారని... ఏం చేసినా, కమిటీ ముందు ఎన్నిసార్లు పిలిచినా ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హోదా కోసం తాము ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తు హోదాతోనే ముడిపడి ఉందని, కమిటీ ఏం చర్య తీసుకున్నా హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు.   

కమిటీలో ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇద్దరు సభ్యులు ఇచ్చి, 5గురు అధికార పార్టీ వారున్నారని పిన్నెళ్లి వివరించారు. ఐతే తమ సింబల్ పై గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బాబు కాళ్ల దగ్గర పడి కండువా కప్పించుకున్న జ్యోతుల నెహ్రూ మా పార్టీ తరపున ప్రివిలేజ్ కమిటీకి హాజరు కావడం చాలా దారుణమన్నారు. ఆయనకు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా తమ పార్టీ తరపున రావొద్దని హెచ్చరించారు. పిలిచే నాయకులకు సిగ్గు లేకపోయినా, నెహ్రూకైనా సిగ్గు, శరం నీతి ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి జ్యోతుల రాజీనామా చేయాలని పిన్నెళ్లి డిమాండ్ చేశారు. నెహ్రూతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా చేతనైతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తమ నాయకుడు వైయస్ జగన్ నాయకత్వంలో  ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి మేం ఎప్పుడూ ముందుంటామన్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. 

వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నామని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లేఖలు రాశారు. ఇప్పటికే 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గత అసెంబ్లీ సమావేశాలలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. హోదా కోసం ప్రజల వాణిని వినిపించడమే తప్పన్నట్టు ప్రభుత్వం  విపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. 

తాజా ఫోటోలు

Back to Top