ఇది ఒక పోరాటం..!

() అనర్హత అధికారం స్పీకర్ పరిధి నుంచి
తప్పించాలి

() ప్రధాన హామీలను అమలు చేయకపోతే ఎన్నికల నుంచి నిషేధించాలి

() తెలుగు నాట ఎన్నికలు ఒకేసారి జరిపించాలి

() కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

హైదరాబాద్) ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే అధికారం స్పీకర్ పరిధి
నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్
న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ
ఎన్నికల సంఘానికి తెలియ చేసిన ప్రతిపాదనల వివరాలు అందించారు. ఆయన ఏమన్నారో ఆయన
మాటల్లోనే..!

       పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల
అనర్హతను నిర్ణయించే అధికారం స్పీకర్ నుంచి తొలగించి ఎన్నికల పరిధిలోకి తీసుకొని
రావాలని కోరటం జరిగింది.అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పటం జరిగింది. ఎందుకంటే
స్పీకర్ సహజంగానే అధికార పక్షానికి చెందిన వ్యక్తిగా ఉంటున్నారు. అటువంటప్పుడు
అనర్హత వేటు వేయటం లేదు. పార్టీ మారిన నాయకులు మాత్రం రాజీనామా చేయటం లేదు. దీంతో
పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అమ్ముడుపోతున్న పరిస్థితి. మంత్రి
పదవుల్లో కొనసాగుతున్న పరిస్థితి.

       మరో ప్రతిపాదన అందించాం. ఎన్నికల
మ్యానిఫెస్టో లో చేసిన 10 ముఖ్యమైన హామీలను ఎన్నికల సంఘం తీసుకోవాలి. వీటిని
నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత ఎన్నికల్లో ఆయా పార్టీలను నిషేధించే
వెసులుబాటు ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు ఏ విధంగా అబద్దాలు చెప్పారు, ఏ విధంగా
మోసాలు చేశారు అనేది మనం చూశాం. 87, 612 కోట్ల మేర ఉన్న రైతుల రుణాలన్నీ బేషరతుగా,
మొత్తంగా మాఫీ చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన డబ్బులు కనీసం వడ్డీలకు కూడా చాలటం
లేదని రైతులు చెప్పటం చూశాం. డ్వాక్రా అక్క చెల్లెమ్మల అప్పులన్నీ మాఫీ చేస్తానని
చెప్పి, అలా చేయకుండా పంగనామాలు పెట్టడం చూశాం. ప్రతీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని
చెప్పారు. లేదంటే మాత్రం ప్రతీ ఇంటికి రూ. 2వేల నిరుద్యోగ భ్రతి ఇస్తామని చెప్పి
మోసం చేయటం చూశాం. ఇవన్నీ తుంగలోకి తొక్కి ప్రజల జీవితాలతో ఆడుకొంటున్న పరిస్థితి
నెలకొంది. ఇవేమీ చేయకుండా ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు, 30 కోట్లు ఇచ్చి తమ
పార్టీ లోకి కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేల చేత రాజీనామా
చేయించి కానీ, అనర్హత వేటు వేయించి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లమని అడుగుతున్నాం.
ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరే ధైర్యం చంద్రబాబుకి లేదు.

       మూడో ప్రతిపాదన ఏమిటంటే..
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగునాట ఒకే సారి జరగాలి. జీహెచ్ఎమ్సీ ఎన్నికలతో సహా
ఒకేసారి జరిపించమని అడిగాం. లేదంటే కొందరు ఓటర్లు అక్కడ ఇక్కడ ఓట్లు వేస్తున్న
పరిస్థితి ఉంది. అది ప్రజాస్వామ్యానికి నష్టం అని తెలియపరిచాం.

       అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించి
పోరాటాన్ని కొనసాగిస్తాం న్యాయం జరుగుతుందో లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే
ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతోందో జాతీయ స్థాయిలోని నాయకులు అందరికీ తెలియపరిచాం.
అందరికీ అరాచకాల్ని వివరించాం. తర్వాత దశలో న్యాయస్థానాల దగ్గరకు కూడా తీసుకొని
వెళతాం. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ, న్యాయం దొరకుతుంది అన్న నమ్మకం మాత్రం ఉంది.
ఈ విషయాలన్నింటితో లేఖ రాసి ప్రధానమంత్రికి కూడా తెలియపరుస్తాం.

       అని వైఎస్ జగన్ వివరించారు.

 

Back to Top