ముద్రగడ దీక్షపై మంత్రుల వెటకారం

  • కాపుల‌కు ఇచ్చిన మాట‌ను సీఎం నిల‌బెట్టుకోవాలి
  • ముద్రగడ దీక్షపై అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు
  • ప్రాంతాలు, కులాల మధ్య తగువ పెడుతున్నారు
  • రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు
  • ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత  మరచి మాట్లాడుతున్నారు
  • వైయ‌స్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ

  • హైదరాబాద్ః కాపు రిజర్వేషన్ల సాధన, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో 9 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్ల రాష్ట్ర మంత్రులు అవమానకరంగా మాట్లాడుతున్నారని వైయ‌స్సార్ సీపీ  సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ఆయన వైద్య నివేదికలు సాధారణంగానే ఉన్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గాన్ని విద్రోహశక్తులుగా చూస్తున్నారని, సున్నితమైన అంశాన్ని జఠిలం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బొత్స ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

    మరోవైపు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఏకంగా అవసరమైతే ముద్రగడను సైతం అరెస్టు చేస్తామంటున్నారని.. వీళ్లంతా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం ఒంటెద్దు పొక‌డ‌కు వెళ్తుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి బాధ్య‌త లేని మాట‌లు మాట్లాడ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు, అధికారులు ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దీక్షకు కూర్చున్న రెండు గంటలకే ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారని, ఆ సందర్భంలో ఆయన కుటుంబసభ్యుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. 

    సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోమంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని, దీన్ని పోలీసు రాజ్యం చేయొద్దని సూచించారు. సమాజంలో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్లకు ఇవ్వాలని, మీ గౌరవం మీరు పుచ్చుకోవాలని  అధికార పార్టీకి సూచించారు.  గెలిచిన పార్టీ నుంచి బయటకెళ్లి విమర్శలు చేయడం సిగ్గుచేటని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.  కేవ‌లం బాబు భ‌యంతోనే ఫిరాయింపుదారులు వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 
Back to Top