కేసులు-కాసులతో అక్రమ పాలన

()ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తుని ఘటన
()కుట్రపూరితంగా భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం
()ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తే బాబుకు గుణపాఠం తప్పదు
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్ః చంద్రబాబు కేసులు, కాసులతో అక్రమ పాలన సాగిస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ముందు కేసులు ఆ తర్వాత లొంగకపోతే కాసులు వెదజల్లుతున్నారని దుయ్యబట్టారు.అలా ప్రలోభాలతో బాబు 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అంబటి తూర్పారబట్టారు.  కాపుల ఉద్యమాన్ని, ప్రతిపక్షాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు, హోంమంత్రి....  తుని సంఘటనతో ఎలాంటి సంబంధం లేని భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని పైర్ అయ్యారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని, అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను అణిచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ బెదిరింపులకు కాపులు గానీ, వైయస్సార్సీపీ గాని బెదరన్న సంగతి గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

తుని ఘటన వైఫల్యానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రైలు, పోలీస్ స్టేషన్ దమనకాండతో కాపులకు సంబంధం లేదు. కడప నుంచి వచ్చిన జగన్ వ్యక్తులు పాల్గొన్నారంటూ చంద్రబాబు బురజల్లారని...ఎలాంటి విచారణ జరగకుండానే సంఘటన జరిగిన క్షణాల్లోనే బాబు చెప్పడం చూస్తుంటే దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది అక్కడ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టడమేంటని  నిలదీశారు. ఏం సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం తగదని సూచించారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన తమ్ముడు ముందస్తు కుట్రలో భాగంగా ఈ హింస చేసి.. వైయస్సార్సీపీ, కాపుల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న కోణంలో వాళ్లను ఎందుకు విచారించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష సమయంలోనూ ఆయనను హింసించి చంద్రబాబు ప్రజల మన్ననలు పోగొట్టుకున్నారని...ఆవిషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. 

హక్కుల కోసం పోరాడుతున్న కాపులకు మద్దతిచ్చినంత మాత్రాన కేసులు పెడతారా...? ఆర్నెళ్లలోపు కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు...ఐదేళ్లలో ఏడాదికి రూ. వెయ్యి చొప్పిన రూ. ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లవుతున్నా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని  బాబు సర్కార్ ను అంబటి కడిగిపారేశారు. మోసపూరిత చంద్రబాబు ఇప్పటివరకు మూడేళ్లలో కాపులకు రూ. 30 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని అంబటి అన్నారు. కానీ, కాపులకు ఏదో చేశామని చెప్పుకుంటూ పత్రికా ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, కాపు కార్పొరేషన్ కు చాలెంజ్ చేస్తున్నా....రూ. 30 కోట్లపైన ఖర్చుపెడితే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని  సవాల్ విసిరారు. యువకులు, కాపుల మీద సీఐడీ ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తుందని ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వాలు,  చంద్రబాబు శాశ్వతం కాదన్నది సీఐడీ తెలుసుకోవాలన్నారు. 

నిమకాయల చినరాజప్ప పేరుకే  హోంమంత్రి అని ...హోం గార్డు ట్రాన్స్ ఫర్ కూడా లోకేష్ పర్మిషన్ తోనే నడుస్తోందన్నారు.  దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో హోం డిపార్ట్ మెంట్ ఉందని అంబటి విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి మీద బలవంతంగా కేసులు రుద్దాలన్న ప్రయత్నాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  బాబు అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాట బావుటా ఎగురవేస్తున్న వారిని పథకం ప్రకారం నొక్కాలని చూస్తున్నరని, బాబు ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని అంబటి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ భూమనను విచారణ పేరుతో వేధించారని, కుట్రపూరిత విధానాలను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ,  కేసులు- కాసులతో కాపులను, ప్రతిపక్ష ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే ఉవ్వెత్తున ఎగుస్తాయని, చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

Back to Top