నిష్పక్షపాతంగా విచారణ జరపాలి


మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ వాయిస్‌ బాబుదేనని తేల్చిన చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌
ఎమ్మెల్యేను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు
సూత్రధారి అయిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదు
చట్టప్రకారం విచారణ జరిపించి ప్రజలకు మంచి సందేశం ఇవ్వండి
అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ ఏర్పాటు మాటేంటీ బాబూ?
మౌనదీక్షకు కూర్చున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలు అరెస్టును ఖండిస్తున్నాం
టీడీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ఓటుకు కోట్ల కేసుపై తెలంగాణ ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఇస్తూ ఆడియో టేపుల్లో మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ అని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు ఇస్తూ దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు కానీ.. సూత్రధారి అయిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఆడియో టేపులోని వాయిస్‌ చంద్రబాబుదేనని ఏసీబీ చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేటతెల్లమైంది. చట్టం, రాజ్యాంగంపై తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ఉంటే కేసును చట్టప్రకారం విచారణ జరిపించాలని కోరారు.

ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు తెలంగాణ సర్కార్‌తో లాలూచీ పడి రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను, ఏపీ హక్కులను తెలంగాణకు కట్టబెట్టారని మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో కూడా మోసం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నదులపై ప్రాజెక్టులు కడుతుంటే దాన్ని అడ్డుకోకుండా చంద్రబాబు చీకటి ఒప్పందాల రీత్యా మౌనంగా ఉన్నారన్నారు. చంద్రబాబులా కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తిలా ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యవహరించాలని వైయస్‌ఆర్‌ సీపీ కోరుతుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా చేయొద్దని కోరారు. 

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని మూడు సంవత్సరాలైనా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శాకమూరులో అంబేద్కర్‌ స్మృతివనం కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ ఒకసారి రూ. వంద కోట్లతో జీఓ, ఇంకోసారి రూ. 90 కోట్లతో జీఓ విడుదల చేశారన్నారు. అయినా ఇప్పటి వరకు టెండర్లు కూడా పిలవలేదంటూ చంద్రబాబుకు దళితులపై ప్రేమ, అంబేద్కర్‌పై గౌరవం ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మౌనదీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇవ్వాలని ప్రతిపక్షం శాంతిదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు పోలీసులతో అణగదొక్కించడం హేయనీయమన్నారు. 

శాసనసభలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై చర్చకు డిమాండ్‌ చేస్తే.. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలపై మాట్లాడాలని.. చంద్రబాబు చెప్పారని, ప్రతిపక్షనేత మేం దాన్ని స్వాగతిస్తున్నాం అని.. కాల్‌మనీ అంశం కూడా ప్రధానమైందని చెబితే.. టీడీపీ నేతలు అవాకులు.. చవాకులు పేలారన్నారు. మాటలు తప్ప చేతలు చేయడం చంద్రబాబుకు చేతకాదన్నారు. రాజ్యాంగాన్ని నిర్మించి చట్టాలన్ని ఏ విధంగా అమలు చేసుకోవాలనే దిక్సూచి ఇచ్చిన మహానుభావుడికి అందరూ గౌరవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు రాజ్యాంగం అన్నా.. చట్టాలు అన్నా చిత్తశుద్ధి లేదని, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రలుగా చేశారన్నారు. 

చంద్రబాబు పరిపాలనలో మహిళలకే కాదు.. పసిపాపలకు కూడా రక్షణ కరువైందని బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా మహిళలపై జరుగుతున్న దాడులు.. మైనర్‌ బాలికపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓట్లు వేసి మా ప్రాణాలను రక్షించాలని, మమ్మల్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరితే.. ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కాదు చంద్రబాబూ మొదట ప్రభుత్వం చేసిన తప్పులకు పశ్చాతాపపడితే అత్యాచార ఘటనలు జరగవన్నారు. 
Back to Top