అసెంబ్లీ సెక్రటరీగా ఇంటర్ వ్యక్తి..సిగ్గు సిగ్గు?

  • ఇంటర్ చదివిన వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీగా నియమిస్తారా..?
  • ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు
  • ఎమ్మెల్యే లేఖలపై గవర్నర్‌ స్పందించకపోవడం బాధాకరం
  • అవినీతి, అక్రమాలను పెంచిపోషించడానికే స్పీకర్‌కు టైంలేదు
  • బాబు అవినీతి ఆగడాల కోసమే ఆ వ్యక్తి నియామకం
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌: అత్యున్నత చట్టసభల్లో కనీసం డిగ్రీ కూడా లేని వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీగా ఎలా నియమించారని వైయస్‌ఆర్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో కార్యదర్శిగా నియమించాలంటే లా డిగ్రీ ఖశ్చితంగా ఉండాలని సభ సర్వీస్‌ రూల్స్‌ స్పష్టంగా చెబుతున్న చంద్రబాబు అధికార అహంతో ఇంటర్‌ చదివిన వ్యక్తిని నియమించారని మండిపడ్డారు. చంద్రబాబు తన కోసం, తన మనుషుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆర్కే విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆర్కే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తన అడ్డగొలు పనులను సభ సాక్షిగా చేయాలంటే...చెప్పినట్లు వినే వ్యక్తి కావాలనే విద్యార్హతలు, అనుభవం లేని వ్యక్తిని కార్యదర్శిగా నియమించారని విమర్శించారు. 

చట్టాలు చేసే సభలో ఇంటర్మీడియట్‌ అర్హత గల వ్యక్తిని నియమించడం కంటే సిగ్గుచేటు విషయం మరొకటి ఉండదన్నారు. ఇంటర్‌ చదివిన వ్యక్తి ముఖ్య అధికారిగా ఉన్నాడంటూ ఎమ్మెల్యేలంతా తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. ఆర్టీఏ యాక్ట్‌ కింద సంవత్సర కాలం క్రితం అసెంబ్లీ అధికారుల విద్యార్హతలు కావాలని దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పూర్తి సమాచారం ఇవ్వలేదన్నారు. ఒక శాసనసభ్యుడు విద్యార్హతలు అడిగితే ఇంత వరకు ఇవ్వలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు గమనించుకోవాలన్నారు. 

గవర్నర్, స్పీకర్, చీఫ్ సెక్రటరీల తీరు ఇదేనా..?
అసెంబ్లీ వ్యవహారాలు చూస్తున్న కనీస విద్యార్హతలు లేని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్, స్పీకర్, చీఫ్‌ సెక్రటరీలకు లేఖలు రాసినా స్పందించకపోవడం బాధాకరమని ఆర్కే అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ అర్హతలు కోరితే అడిగిన ఫిర్యాదుదారుడికి సర్టిఫికేట్లు అందజేశారని, అంత బలమైన ఆర్టీఏ స్పందిచకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ సెక్రటరీ పోస్టును అపాయింట్‌ చేసే గవర్నర్‌ ఎమ్మెల్యే లేఖకు స్పందించకపోయేంత తీరిక లేదా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును తప్పించడానికి రాజ్‌భవన్‌ను రాజీ భవన్‌గా మార్చారని ప్రజలంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే గవర్నర్‌ కూడా బాబుకు లొంగిపోయాడా అనే అనుమానాలు కల్గుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పూర్తి దర్యాప్తు చేసి విద్యార్హతలు లేని అధికారిని తప్పించాలని డిమాండ్‌ చేశారు.

ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటుండదు
రెండు సార్లు ఉద్యోగానికి పొడగింపు తీసుకునే సమయం చీఫ్‌ సెక్రటరీకి ఉంటుంది కానీ ఎమ్మెల్యే లేఖపై జవాబిచ్చే తీరికలేదా అని ఆర్కే ప్రశ్నించారు. స్వయంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును కలిసి లేఖలు సమర్పించి చర్యలు తీసుకోవాలని విన్నవించినా ఆయనకు సమయం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గ కాంట్రాక్టర్‌లను బెదిరించి డబ్బులు కాజేయడానికి, అవినీతి అక్రమాలను పెంచి పోషించడానికే స్పీకర్‌కు టైం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల తరుపున అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైక్‌ కట్‌ చేయడానికి ఉన్నంత సమయం తనకింద పని చేసే వ్యక్తి ఇంటర్‌ చదివాడని తెలుసుకునే తీరికలేదా అని నిలదీశారు. వీటన్నింటికి బాధ్యుడు చంద్రబాబేనన్నారు. కనీసం విద్యార్హతలు లేని వ్యక్తిని చట్టసభలో పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు అవినీతి అక్రమాలకు సహాయం చేసేందుకు, ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఆయన మాటలను వినే వ్యక్తిని నియమించుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆ వ్యక్తితో రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే అంతకంటే దౌర్భాగం ఇంకోటుందన్నారు. ఆ వ్యక్తి నేరాలను ఆధారాలతో సహా హైకోర్టులో హాజరుపరిచామని, అసెంబ్లీ కార్యదర్శిపై చార్జ్‌షీట్‌ ఫైల్‌ అయితే సీసీఏ రూల్స్‌ ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించాలని సూచించారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సెక్రటరీపై కేసు నమోదైందని తెలిపారు. ఇదీ కూడా స్పీకర్‌కు తెలియదా అని చురకంటించారు. ఈ విషయంపై గవర్నర్, చీఫ్‌ సెక్రటరీ, స్పీకర్‌ బాధ్యత వహించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
Back to Top