ఆహ్వానం పంపకుండా అవమానిస్తారా..!

– ఒక శాసనసభ్యుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా
– ఈ ప్రభుత్వంపై ప్రజలకే ఫిర్యాదు చేస్తా
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరుః జిల్లా ఆస్పత్రిలో జరిగే సమావేశాలకు శాసనసభ్యుడినైన తనను పిలవకుండా అధికారులు అవమానించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి అభివృద్ధి, సలహా సంఘం సమావేశం బుధవారం జరిగింది. తనకు కనీస సమాచారం కూడా లేకపోవడంతో పత్రికల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు బుధవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి విచ్చేశారు. సూపరింటెండెంట్‌ చాంబర్‌లోకి వెళ్లి కమిటి సమావేశానికి ఎందుకు తనను ఆహ్వానించలేదని అధికారులను ప్రశ్నించారు. ఏ అధికారి ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసాద్‌ను కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి పిలిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి కమిటి సమావేశం జరుగుతోందని, అయినా తనకు సమాచారం లేదన్నారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడటానికి ఆస్పత్రికి రాగా కూర్చోమని చెప్పడం గానీ, కూర్చున్న అధికారులు లేవడం గానీ జరగలేదన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ ప్రభుత్వం, అధికారులు ఇవ్వలేదని, మరొక్క సారి తనను అవమానించారని ఎమ్మెల్యే ఆవేదన చెందారు. 350 పడకల ఆస్పత్రి ద్వారా నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించడంలో ప్రముఖ పాత్రపోషించాల్సిన వ్యక్తి తానే అని అన్నారు. కలెక్టర్‌ వస్తున్నా తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే కారణంతో అవమానిస్తున్నారు...
ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అధికారులు వత్తాసు పలుకుతూ తనను పదే పదే అవమానిస్తున్నారని చెప్పారు. ఆహ్వానం పంపడానికి ఈ కమిటిలో ప్రత్యేకంగా సభ్యుడు కానవవసరం లేదని, ఎమ్మెల్యేగా ఈ ఆసుపత్రికి ఎప్పుడైనా రావచ్చని, తనిఖీ చేసే అధికారం తనకు ఉందన్నారు. అంతేగాక ఇక్కడ తీసుకోబోయే నిర్ణయాలు తనకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందనిచెప్పారు. తన మంచి తనాన్ని, సంస్కారాన్ని ఈ అధికారులు అలుసుగా తీసుకుంటున్నారన్నారు. ప్రోటాకాల్‌ కోసం గొడవ చేయరాదనే కారణంతో ఎంతో హుందాగా నడుచుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి, అధికారులకు బుద్ధి రాలేదన్నారు. తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజల అవసరాలను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తుల చేత అధికారులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అమృతానగర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి పంచాయతీరాజ్‌ అధికారులు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పిలిస్తే వెళ్లారన్నారు. తన చేతిలో ఓడిపోయిన వ్యక్తి పిలిస్తే పంచాయతీ అధికారులు భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేగా తనను సమావేశాలకు ఆహ్వానించకుండా, సలహాలు తీసుకోకపోవడమనేది ఎంత వరకు న్యాయమని ఎమ్మెల్యే అన్నారు. తనను అవమానించడం వల్ల అధికారులు పొందే తృప్తి ఏపాటిదో చెప్పాలన్నారు. తన ప్రత్యర్థులైన టీడీపీ నాయకులను సంతృప్తి పరచడానికి మాత్రమే అధికారులకు ఇది ఉపయోగం పడుతుంది కానీ అంతకు మించిన ప్రయోజనం లేదని తెలిపారు.

ప్రభుత్వమే తప్పు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి ?
ఈ ప్రభుత్వమే తప్పు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఫిర్యాదు చేయాల్సింది ప్రజలకే అని, వారే దీనిపై ఆలోచించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ఒక్క రోజు కూడా నా సేవలను వినియోగించుకునే స్థితిలో ఇక్కడి అధికారులు లేరని . చివరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటిలో కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేలను తొలగించిందన్నారు. శాసన సభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్నందున వారికి ఎలాంటి సేవలు చేయాలో, ఎమ్మెల్యేగా తన బాధ్యత ఏమిటో చెప్పాలన్నారు. అధికారులు అగౌర పరిచేది తనను కాదని తనకు ఓటేసిన రెండు లక్షల మంది ప్రజలను అని అన్నారు. ప్రతి అధికారినిసార్‌ అని పిలుస్తూ ఎంతో గౌరవించే మనస్తత్వం తనదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.

Back to Top