కష్టాల్లోంచి ప్రజలను గట్టెక్కించాల్సింది పోయి.. వెన్నుపోటు పొడవడం దారుణం

02–07–2018, సోమవారం 

కోలంక, తూర్పుగోదావరి జిల్లా 



అశేష
ఆత్మీయ జనసమూహం వెంటరాగా.. గౌతమీ నదిపై.. బాలయోగి వారధి మీదుగా పాదయాత్ర సాగింది.
సాగర సంగమానికి ఉరకలెత్తుతున్న గౌతమీ గోదావరిని చూ స్తుంటే.. జల ప్రాజెక్టులను
త్వరితగతిన పూర్తిచేసి.. సముద్ర గర్భంలో కలిసిపోతున్న అపార జలరాశిని సద్వినియోగం
చేసి.. కోట్లాది మంది ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చగలిగితే..
అంతకన్నా అదృష్టం ఏముంటుందనిపించింది.  


ప్రాంత ప్రజల బాగోగులను పట్టించుకోని ఆయిల్‌ కంపెనీలపై, వాటితో కుమ్మక్కయిన అధికార
పార్టీ నాయకులపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్న వాస్తవం కాదనలేనిది. చమురు
కంపెనీలలో పనిచేసే వందలాది మంది స్థానికులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తుంటే.. అండగా
ఉండాల్సిన పాలకపార్టీ ప్రజా ప్రతినిధులు.. కంపెనీ యాజమాన్యాలతో లాలూచీపడి తమకు
తీరని ద్రోహం చేస్తున్నారని కన్నెర్రజేశారు కార్మిక సంఘ ప్రతినిధులు. గతంలో
కార్మికులు తమ ఉద్యోగాల తొలగింపును నిరసిస్తూ.. 145 రోజులు ఆందోళనలు, దీక్షలు చేస్తే..
డిమాండ్లకు కంపెనీ యాజమాన్యాలు అంగీకరించాయని, తిరిగి ఉద్యోగాల్లో
చేర్పించే బాధ్యత తమదేనని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు బూటకపు
హామీలిచ్చారట. నిమ్మరసం ఇచ్చిమరీ దీక్షను విరమింపజేశారట.

ఆ తర్వాత ఉద్యోగాలొచ్చిందీ
లేదు.. ఆ ప్రజా ప్రతినిధులు పట్టించుకున్నదీ లేదు. ఇది నమ్మించి మోసం చే యడం
కాదా.. అంటూ బావురుమన్నారు ఆ కార్మిక సోదరులు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాల్లో
పాలుపంచుకుని గట్టెక్కించాల్సింది పోయి.. వారికే వెన్నుపోటు పొడవడం చాలా దారుణం. 

‘చమురు
సంస్థలన్నీ ముమ్మిడివరంలో ఉంటే.. అభివృద్ధి అంతా యానాంలో ఉంది’అంటూ వాపోయారు ముమ్మిడివరం
నియోజకవర్గ మత్స్యకార సోదరులు. ‘అన్నా.. ఆయిల్‌ కంపెనీల నుంచి
మత్స్యకార కుటుంబాలకు రావాల్సిన పరిహారంలోనైనా, ప్రయోజనాలలోనైనా, అభివృద్ధి నిధులలోనైనా..
యానాంవాసులు మాకన్నా చాలా మెరుగ్గా ఉన్నారు. కారణం.. మా ప్రజాప్రతినిధులకు
చిత్తశుద్ధి లేకపోవడం.. లాలూచీ రాజకీయాలు నడపడం.. మా ప్రయోజనాలను పణంగా పెట్టి
స్వలాభం చూసుకోవడం’అంటూ
పాలక పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన పాపానికి శిక్ష
అనుభవిస్తున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు. 

యానాంలో
అడుగుపెట్టగానే అపురూప స్వాగతం లభించింది. అల్లంత దూరంలో 18 అడుగుల నాన్నగారి కాంస్య
విగ్రహం.. ఈ ప్రాంత ప్రజల కృతజ్ఞతాభావానికి నిదర్శనంగా కనిపించింది. ఒకానొక దశలో
యానాం ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్న సమయంలో.. 55 ఎకరాల భూమిని కేటాయించి..
రిజర్వాయర్‌ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించి.. ధవళేశ్వరం నుంచి తాగునీటిని
అందించి.. యానాం ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత నాన్నగారిదేనని, సమస్య ఎక్కడుంటే.. అక్కడ
పరిష్కారంలా నిలిచారని చెబుతుంటే.. చాలా గర్వంగా అనిపించింది.  

నేటి
సాయంత్రంతో ప్రజా సంకల్ప యాత్ర కోనసీమను దాటి రామచంద్రపురంలోకి ప్రవేశించింది. గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో
జరిగిన పాదయాత్రలో కోనసీమ అందం వెనకున్న అలజడి చూసి.. గుండె తరుక్కుపోయింది.
దళారుల చేతుల్లో దగా పడుతున్న ఆక్వా రైతులు.. సాగు నీరందక, గిట్టుబాటు ధరల్లేని
రైతన్నల దీనావస్థ.. కుదేలైన కొబ్బరి రైతు కష్టాలు.. పెద్ద పెద్ద కంపెనీలున్నా
స్థానికులకు దక్కని ఉద్యోగాలు.. సకల వనరులున్నా తాండవిస్తున్న దారిద్య్రం..
వానొచ్చినా వరదొచ్చినా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే లంక గ్రామాల దుస్థితి..
గోదారి పక్కనే ఉన్నా గొంతెండిపోతున్న గ్రామాలు.. వలసబాట పడుతున్న మత్స్యకారుల
వెతలు.. ఉపాధిలేక ఎడారి దేశాలకు తరలిపోతున్న పేద ప్రజల కన్నీటి కథలు.. ఇలా ప్రతి
కష్టమూ ఈ పాలనలోని డొల్లతనాన్ని పట్టిచూపేదే. దొరికిన ఏ అవకాశాన్నీ వదలకుండా
దోపిడీకి తెగబడుతున్న పాలకులు ఉన్నంతకాలం.. కోనసీమ లాంటి ప్రాంతాలకైనా కన్నీళ్లు
తప్పవు. 

ముఖ్యమంత్రిగారికి
నాదో ప్రశ్న..
 

ఆయిల్‌ కంపెనీల వల్ల నష్టపోయిన
మత్స్యకారులకు ఒప్పందం ప్రకారం న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామన్నారు..
ఏమైందా హామీ? మీ పాలన వచ్చిన తర్వాతనే.. పరిహారంఆగిపోవడం వాస్తవం కాదా? మీరు అధికారంలోకి వచ్చాకనే.. ఆ
కంపెనీల నుంచి వస్తున్న నిధులు తగ్గిపోయి, అభివృద్ధి పనులు కుంటుపడటం నిజం
కాదా? మీరు పగ్గాలు చేపట్టాకనే..
ఇక్కడి స్థానికులకు ఉద్యోగాలు ఊడటాన్ని కాదనగలరా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం
ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటున్న ఈ ప్రాంతవాసులకు ఏమని సమాధా నం చెబుతారు?


Back to Top