ఓటుకు కోట్లు కేసు విచారణ షురూ

హైదరాబాద్ :ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించింది. ఇంతకుముందు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా.. పిటిషనర్లు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది.  తదుపరి విచారణ సోమవారానికి వాయిదాపడింది. 
 
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు ఇచ్చి కొంటూ  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.  ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు గొంతు కూడా వినిపించడం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్ధారించడంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కేసును పునర్విచారించి, అందులో చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. (ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే)
 
దాంతో ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించాలని ఆదేశించగా, దాన్నుంచి తప్పించుకునేందుకు విచారణ ఎదుర్కోకుండానే చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేను సవాలుచేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేసును నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ మొదలైంది.  ఆర్కే తరపు సుధాకర్ రెడ్డి ఓటుకు కోట్లు కేసులను వాదిస్తున్నారు. 
Back to Top