ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు అన్యాయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున 
గుంటూరు: వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం, పెదగాదెలవ్రరు గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి  లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూమేరుగ నాగార్జున ఆధ్వర్యంలో బాధితులు సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలనా అధికారి కె.నాగబాబును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదగాదెలవ్రరు గ్రామంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడానికి గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్ల స్థలాలకు భూములు సేకరించిందని తెలిపారు. గ్రామంలో అర్హత కల్గిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారుల జాబితాను తయారు చేసిన అధికారులు గడచిన నాలుగు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయలేదని తెలిపారు. ఇటీవల గతంలో గుర్తించిన లబ్ధిదారులను తొలగించి అర్హత లేనివారికి, గ్రామంలో నిఆవసం ఉండనివారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. నిజమైన అర్హత కల్గిన పేదవారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అక్రమ ఇళ్ల పట్టాలను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్పందించిన జిల్లా పరిపాలనా అధికారి కె.నాగబాబు తక్షణమే ఆర్డీవోను విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవోచే విచారణ జరిపించి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇప్పించేలా చూస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలం అధ్యక్షుడు గాదె శివరామకృష్ణారెడ్డి, నాయకులు పలకలూరి కస్తూరి, మూల్పూరి స్వామి, బాధితులు ఉన్నారు.
Back to Top