పోలవరం ముంపు బాధితులకు తీవ్ర అన్యాయం

తూర్పు గోదావరి:

పోలవరం ప్రాజెక్టు నా కల అంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్యాకేజీపై మక్కువ చూపుతున్నారని, ముంపు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుని నియోజకవర్గంలో పోలవరం 5వ ప్యాకేజీ పనుల కోసం కుమ్మర్ల కాలనీ ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ కాలనీలో పర్యటించారు. ఆ సమయంలో ఈ లెఫ్ట్‌ కెనాల్‌ అలైన్‌మెంట్‌ చేయించి ఇస్తానని, మార్పిస్తానని ప్రజలను మభ్యపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక యనమల మాట తప్పారు. కాలనీలో ఇంచుమించు అన్ని ఇళ్లు ఒకేలాగ ఉంటాయి. ఇక్కడ టీడీపీ కార్యకర్తకు నాలుగు ఖాళీ సైట్లు ఉంటే..ఒక్కొ సైట్‌కు రూ.4 లక్షలు, అదే నోరులేని ప్రజలు ఉంటే వాళ్లకు పరిహారం రూ.1.30 లక్షలు, జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సు చేసిన వారికి రూ.10 లక్షలు ఇస్తున్నారు. పోలవరం నా కల అని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ముఖ్యమంత్రిని ఒక్క విషయం అడుగుతున్నాను. సార్‌ పోలవరం మీ కల, లేదంటే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్యాకేజీ మీ కలా? చిన్న క్లారిటీ కావాలి. పోలవరం తుని నియోజకవర్గంలో 17 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ గత కాంట్రాక్టర్‌ 50 నుంచి 60 శాతం పనులు పూర్తి చేశారు. రూ.90 కోట్లతో పూర్తి చేసిన పనులకు మళ్లీ ప్రతిపాదనలు రూపొందించి నామినేషన్‌ పద్ధతిలో రూ.250 కోట్లతో యనమల బంధువుకు పనులు అప్పగించడం ఎంత వరకు సబబు. ఇప్పటికే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు..పోలవరం నా కల అంటావు. మీరు చేసే మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని దాడి శెట్టి రాజా అన్నారు. 

Back to Top