రైల్వే జోన్ కోసం ఆమరణ దీక్ష

విభజన హామీలను విస్మరించిన కేంద్రం
హామీలను సాధించుకోవడంలో టీడీపీ విఫలం
టీడీపీ-బీజేపీల పాలనలో ఏపీకి అన్యాయం
రైల్వే జోన్ సాధనే వైఎస్సార్సీపీ లక్ష్యం
ఈనెల 14 నుంచి గుడిపాటి ఆమరణ దీక్ష

విశాఖపట్నంః విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బొత్స ఫైరయ్యారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇవాళ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్నీ పార్టీల నేతలు ఈసమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ...రైల్వే జోన్ అంశాన్ని ఉత్తరాంధ్ర సమస్యగా చూడొద్దని, రాష్ట్ర ప్రజల సమస్యగా చూడాలన్నారు. 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఎమ్మెల్యే స్థానాల పెంపుపై ఉన్న ధ్యాస...ప్రజాసమస్యలు, రైల్వే జోన్ పట్ల లేకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టు తిరగడం తప్ప రాష్ట్రానికి సాధించిందేమీ లేదని ఎధ్దేవా చేశారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడకపోవడం దుర్మార్గమన్నారు. రైల్వే బడ్జెట్ జరుగుతుంటే టీడీపీ ఎంపీలంతా ఆహా...ఓహా...అంటూ బల్లలు చరుస్తుంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పోరాడకుండా సొంత ప్రయోజనాలు చూసుకోవడం దారుణమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

కొందరు వ్యక్తుల స్వార్థం కోసం తెలుగు రాష్ట్రం ముక్కలు కావడం బాధాకరమని బొత్స వాపోయారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి రెండు ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. 
 వెంకయ్యనాయుడు మన రాష్ట్రానికి చెందిన వారు కావడం అదృష్టమని పొగిడే చంద్రబాబు...రైల్వే జోన్ విషయంలో ఆయనపై ఎందుకు ఒత్తిడి చేయడం  లేదని బొత్స ప్రశ్నించారు.  రైల్వే జోన్ సాధన కోసం ఇప్పటికే పలుమార్లు తమ అధ్యక్షులు వైఎస్ జగన్  ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. రైల్వే జోన్ సాధనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బొత్స తేల్చిచెప్పారు. 

ఇటీవల జాట్ లు ఆందోళన తీవ్రం చేసి హక్కులను సాధించుకున్నారని, కాపులు ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారన్నారు. ఇదే రీతిలో విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఈనెల 14నుంచి పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈపోరాటంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top