చంద్రబాబు అసమర్థత వల్లే అత్యాచారాలు


నాలుగేళ్లుగా ఆడవారిపై విపరీతంగా పెరిగిన దాడులు
నేరస్తులను శిక్షించకుండా ప్రభుత్వ తాత్సారం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసిన ఎంపీ వరప్రసాద్‌

తిరుపతి: చంద్రబాబు నాయుడి పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు అసమర్థత వల్ల అమాయక బాలికలు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. తిరుపతిలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటన నిందితుడు సుబ్బయ్య టీడీపీలో క్రియాశీలక కార్యకర్త అని, అతనికి చంద్రబాబు సంతకంతో సభ్యత్వం కూడా జారీ చేశారని గుర్తు చేశారు. అధికారం ఉందనే అండతోనే టీడీపీ కార్యకర్తలు దారుణాలు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నా.. చంద్రబాబు టీడీపీ నేతలకు కొమ్ముకాస్తూ వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. గత మూడేళ్లకాలంలో 2 వేల మందిపై అత్యాచారాలు జరిగాయని, వాటిలో 15 మందికి మాత్రమే శిక్ష పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. 
Back to Top