మెడికల్ సీట్ల భర్తీలో బిసిలకు అన్యాయం

విజయవాడ ప్రభుత్వ
నిర్లక్ష్యం నిర్లిప్తతల కారణంగా మెడికల్ సీట్లభర్తీలో బలహీన వర్గాలకు తీరని
అన్యాయం జరుగుతోందనీ, దీనిని నివారించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని వైయస్ఆర్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఈ నష్టాన్ని
నివారించని పక్షంలో ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు బడుగు బలహీన వర్గాల ఆగ్రహాన్ని
చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం
ఆయన మీడియా సమావేశంలో మట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ లో కన్వీనర్
కోటా ఓపెన్ కేటగిరీలో అడ్మిషన్ పొందిన బిసి, ఎస్టీ విద్యార్ధులను కూడా రిజర్వేషన్లు
కోటాలో సీట్లు పొందినట్లుగా పరిగణించడం వల్ల తీరని నష్టం కలుగుతోందన్నారు. వాస్తవంలో
ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సీట్లు పొందవచ్చన్నారు. ఒకవేళ ఎవరైనా రిజర్వుడు
కేటగిరిలోని వారికి సీట్లు వచ్చినా, వారిని ఆ కేటగిరీ కింద పరిగణించరని ఆయన అన్నారు.

ప్రభుత్వ విధానాల
వల్ల అనేక వందల మంది విద్యార్ధులు సీట్లు వచ్చే అవకాశాలను కోల్పోతున్నారని ఆయన
మండిపడ్డారు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన, అడిగిన వారి తోకలు కత్తిరిస్తాం,
తోలు తీస్తామంటూ హెచ్చరిస్తున్న పాలకులు, అణగారిన వర్గాల రిజర్వేషన్లను
కత్తిరిస్తూ వారి అవకాశాలకు గండికొడుతున్నారని  ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పిదాల
వల్లే గతంలో మైనార్టీ కళాశాలల్లో జరిగిన అడ్మిషన్ల వల్ల విద్యార్ధులు రోడ్డున పడ్డ
విషయం ఎవరూ మరచిపోలేదని, అటువంటివి పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఆయన అన్నారు. మెడికల్ సీట్ల భర్తీలో ఓపెన్ కేటగిరిలో సీట్లు పొందిన బిసి, ఎస్సీ,
ఎస్టీ వర్గాల విద్యార్దులను రిజర్వుడు కేటగిరీగా పరిగణించవద్దని ఆయన డిమాండ్
చేశారు. ప్రభుత్వం తప్పును వెంటనే సరిదిద్దుకుని , విద్యార్ధులకు అన్యాయం జరగకుండా,
న్యాయబద్దంగా సీట్లు కేటాయించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top