'ఇళ్ళు లేవు.. ఆరోగ్యశ్రీ అంతకన్నా లేదు'

ఆరుగొలను (కృష్ణా జిల్లా), 10 ఏప్రిల్‌ 2013: రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది చంద్రబాబు పాలన పార్టు-2 అని మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌తనయ శ్రీమతి షర్మిల అభివర్ణించారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆరుగొలను చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరుగొలను గ్రామస్థులు శ్రీమతి షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ మర‌ణించిన తరువాత గ్రామంలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదని గ్రామస్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇళ్ళు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, పావలా వడ్డీ రుణాల పేరు చెప్పి బ్యాంకులు రూపాయి పావలా వడ్డీ కట్టించుకుంటున్నాయంటూ మహిళలు వాపోయారు. సరఫరా లేకపోయినా కరెంట్‌ బిల్లులు మాత్రం భారీగా వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్లు లేక ఇబ్బందిగా ఉందని తెలిపారు.

గ్రామస్థుల సమస్యలను శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ... జగనన్న సిఎం అయ్యాక రాజన్న పాలన తెస్తారని వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో బెల్టుషాపులు లేకుండా చేస్తామని, రైతులకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలను లక్షాధికారులు చేయాలని మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూ‌ట్లు పోడిచిందని విచారం వ్యక్తంచేశారు.

మహానేత వైయస్‌ఆర్ మంచి మనస్సుతో పాలించారని అందు‌కే రాష్టంలో సకాలంలో వర్షాలు కురిసాయని శ్రీమతి షర్మిల తెలిపారు. ఆయన ఉన్నప్పుడు ఇళ్ళు, స్థలాలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంతవరకూ ఇళ్ళు గాని, స్థలాలు గాని పేదలకు ఇవ్వకపోవడమేమిటని తప్పుపట్టారు. విద్యుత్‌ సరఫరా ఎంతసేపు ఉంటుందన్న శ్రీమతి షర్మిల ప్రశ్నకు మహిళలు ఏడు, ఐదు, రెండు గంటలు వస్తున్నదని సమాధానం చెప్పారు.

 గతంలో చంద్రబాబు పాలనలో వలసలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడిపోయిందని ఆరోపించారు. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని, అందుకే అప్పడు దేవుడు కూడా కరుణించలేదని, వర్షాలు కురవలేదని అన్నారు. ప్రజలకు మళ్లీ ఇప్పుడు అవే కష్టాలు వచ్చాయన్నారు. విద్యుత్ ‌చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.
Back to Top